అమరావతి: రాష్ట్రంలో రెవెన్యూ రికార్డుల అమలు, భూవివాదాల పరిష్కారానికి నక్షా కార్యక్రమం నిర్వహించనున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు. 'పారదర్శక, సమర్థ పాలన అందించేందుకు కేంద్రం దీన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ కింద దేశంలోని 152 (ఆంధ్రప్రదేశ్‌లో 10) మున్సిపాలిటీలను ఎంపిక చేశారు. 9.5 లక్షల ఆస్తులను సర్వే చేసి డిజిటలైజేషన్ చేస్తారు. ఈ సర్వే పూర్తైతే ఆస్తుల వివాదాలకు చెక్ పెట్టొచ్చు' అని ఆయన అన్నారు. కేంద్ర సహకారంతో "నక్ష" ((National Geospatial Knowledge-based Land Survey of Urban Habitations)) కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్‌పై నిర్వహించిన జాతీయ స్థాయి వర్క్‌షాప్‌లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. పట్టణాల్లో భూ వివాదాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం "నక్ష" కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 10 మున్సిపాలిటీలను కేంద్రం నక్ష పైలట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎంపిక చేయగా.. ఇప్పటివరకు 8 మున్సిపాలిటీలలో ఏరియల్ సర్వే పూర్తయ్యిందని తెలిపారు. ఏలూరు, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లలో ప్రస్తుతం కొనసాగుతోందని చెప్పారు. కుప్పం,ఒంగోలు,అనంతపురం మున్సిపాలిటీల్లో 6000 ప్రభుత్వ ఆస్తుల సర్వే పూర్తయ్యిందని మంత్రి నారాయణ వెల్లడించారు.