'వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌పై ఆందోళన వద్దు'.. కేంద్రమంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మూతపడుతుందని ఎవరూ ఆందోళన చెందవద్దని కేంద్రమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి అన్నారు.

By అంజి  Published on  11 July 2024 12:34 PM IST
Visakha Steel Plant, Union Minister Kumaraswamy, Vizag, APnews

'వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌పై ఆందోళన వద్దు'.. కేంద్రమంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మూతపడుతుందని ఎవరూ ఆందోళన చెందవద్దని కేంద్రమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి అన్నారు. గురువారం నాడు విశాఖపట్నం పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి స్టీల్‌ ప్లాంట్‌లోని వివిధ విభాగాలను పరిశీలించారు. ప్లాంట్ ఉత్పత్తి కార్యకలాపాలను సమీక్షించి, ప్లాంట్ కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ను పరిరక్షించడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. ఉక్కు కర్మాగారం పరిశీలించిన తర్వాత కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ ప్లాంట్‌ దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో సహాయపడుతుందని అర్థమైందన్నారు.

ఈ ప్లాంట్‌పై ఆధారపడి ఎంతోమంది బతుకుతున్నారని తెలిపారు. ప్రధాని మోదీ ఆశీస్సులతో వంద శాతం సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విజిటర్స్‌ బుక్‌లో కేంద్రమంత్రి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. కేంద్రమంత్రి వెంట కేంద్రసహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, విశాఖపట్నం ఎంపీ భరత్‌ ఉన్నారు. అంతకుముందు ఢిల్లీ నుంచి విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన స్టీల్ ప్లాంట్ ఆర్​ఐఎన్​ఎల్​ గెస్ట్ హౌస్​కి వెళ్లారు.

Next Story