పల్లె పండుగలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

రాజకీయాల్లో ప్రజల మన్ననలు పొందడం, వారి కోసం పాలకులతో పోరాడటం సులభమే కావొచ్చు.

By Kalasani Durgapraveen  Published on  14 Oct 2024 6:50 PM IST
పల్లె పండుగలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

రాజకీయాల్లో ప్రజల మన్ననలు పొందడం, వారి కోసం పాలకులతో పోరాడటం సులభమే కావొచ్చు.. పరిపాలన చేతికొచ్చాక ప్రజల అభిమానం చూరగొనడం, వారి సంక్షేమాన్ని, అభివృద్ధిని జాగ్రత్తగా ముందుకు నడిపించడంలోనే అసలైన నాయకత్వం దాగుంటుందన్ని.. గ్రామగ్రామాన నేటి నుంచి వారం రోజులుపాటు సాగే పల్లె పండుగ కార్యక్రమం ఇంత నిండుగా జరుగుతుంటే మదిలో ఆనందంగా ఉందన్ని.. ఎన్నికల ముందు కూటమి జట్టుగా ముందుకు వెళితేనే రాష్ట్రాభివృద్ధి పరుగులు తీస్తుందని నేను నమ్మి తీసుకున్న నిర్ణయం సరైందే అనిపిస్తోందని ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల కోసం తీసుకునే ఏ నిర్ణయం అయినా వారి మధ్యనే జరగాలి. వారితోనే జరగాలన్నారు. వారి వల్లనే జరగాలి అన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. ఎలాంటి గుట్టుమట్లకు తావివ్వకుండా పారదర్శకంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వారం రోజుల పాటు పల్లెల్లో నిర్వహించబోయే ‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని కంకిపాడులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. కంకిపాడు, పునాదిపాడుల్లో చేయతలపెట్టిన పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన గ్రామ సభల్లో 30 వేల పనులకు తీర్మానాలు చేశారు. ప్రజలంతా కలిసి తమ గ్రామాల్లో కావల్సిన అభివృద్ధి పనులను వారే తీర్మానించుకున్నారు. దీనిలో ప్రజా ప్రతినిధుల ప్రమేయం లేదన్నారు. పూర్తిగా ప్రజలు తీసుకున్న అభివృద్ధి పనులకు నేటి నుంచి వారం రోజులపాటు శంకుస్థాపనలు జరగనున్నాయి. సంక్రాంతి నాటికి పనులు పూర్తి కావాలన్నదే లక్ష్యం. కీలకమైన పనులన్నీ ఇప్పటికే గుర్తించాం. దానికి కలెక్టర్లు పరిపాలన ఆమోదాలు ఇచ్చారన్నారు. దీంతో పనులన్నీ మొదలుకానున్నాయి. ప్రతి పనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునేలా సమాచార బోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. శంకుస్థాపన చేసిన దగ్గరే ఆయా పనుల పూర్తి వివరాలు దీనిలో ఉంటాయి. సామాన్యుడు సైతం సులభంగా పనులు, నిధులు, నాణ్యత తెలుసుకునేలా వీటిని ఏర్పాటు చేస్తున్నాం. పూర్తి పారదర్శకతతో పనులు జరగాలన్నదే ప్రధాన లక్ష్యం. ప్రజలంతా ఈ పనుల్లో భాగస్వామ్యం కావాలన్నారు.

• గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ మంత్రి ఎవరో తెలీదు

ప్రతిసారీ గత ప్రభుత్వాన్ని విమర్శించాలని అనుకోను కానీ... గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం మాత్రం కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన విధానం ఎలా ఉంది.. ఇప్పుడు జరుగుతున్న కూటమి ప్రభుత్వ విధానాలను ఎంత పారదర్శకతతో ఉన్నాయో ప్రజలకు చెప్పాలని భావిస్తాను. గత ప్రభుత్వంలో ప్రజలకు కనీసం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో కూడా తెలీని దౌర్భాగ్యం ఉండేది. అధికారులు, సిబ్బంది అనేది అసలు తెలీదు. ఇక గత ప్రభుత్వం అయిదేళ్ల కాలంలో గ్రామ సభలు నిర్వహించిన దాఖలాలు లేవు. ప్రజలు పనులు చేసేందుకు తీర్మానం కాదు కదా... పనులు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని అర్జీ ఇచ్చినా పరిష్కరించిన దాఖలాలు లేవు. అసలు పంచాయతీరాజ్ నిధులు ఏమయ్యాయో కూడా తెలీదు. నేను ఈ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేకసార్లు నిధుల మీద సమీక్షించినా గత ప్రభుత్వంలో నిధులు ఎలా, ఎటు వెళ్లాయనేది ఓ బ్రహ్మ పదార్థంలా కనిపించింది. కూటమి ప్రభుత్వంలో ప్రతి పని ప్రజలకు తెలియాలి. ప్రజలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలనే నిర్ణయంతో గ్రామసభలను రికార్డు స్థాయిలో నిర్వహించాం. గ్రామాల్లో ప్రాధాన్యతలను బట్టి ఏం పనులు చేయాలో రాజకీయాలకు అతీతంగా ప్రజలు చేసిన తీర్మానాలతోనే ఇప్పుడు పనులు మొదలుపెడుతున్నాం అన్నారు.

• నిజాయతీగా పనిచేసే అధికారులకు ప్రొత్సాహం..

ప్రజలు ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. దీన్ని అంతే బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాకినాడలో ఓ అటవీ శాఖ అధికారి నా పేరు ఉపయోగించి చేస్తున్న కొన్ని పనులు నా దృష్టికి ప్రజలే తీసుకొచ్చారు. వెంటనే నేను స్పందించాను. అసలు జరిగిన విషయాన్ని విచారించాలని అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించాను. వచ్చిన ఆరోపణలు రుజువైతే సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడేది లేదు. మేమెంత నిజాయతీగా, నిబద్దతతో ప్రజల కోసం పనిచేస్తున్నామో అధికారులు కూడా అలాగే పని చేయాలి. ప్రజల ఆకాంక్షలు, వారి అవసరాలు తీర్చడానికి అధికారం పనిచేయాలి. అధికారుల విషయంలో చిత్తశుద్ధితో ముందుకు వెళ్తాం. పని చేసిన వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఏమైనా తేడా వస్తే అంతే కఠినంగా వ్యవహరిస్తాం అన్నారు.

• సమన్వయంతో ముందుకు వెళ్లాలి

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో జరిగే పనులను ఇతర శాఖలు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలి. దాదాపు 10 శాఖలను జాగ్రత్తగా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తేనే పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. ఉపాధి హామీ పథకం అనేది చాలా గొప్ప కార్యక్రమం. దానిని సరిగా వినియోగించుకుంటే గ్రామాల్లో చాలా పనులు చేసుకోవచ్చు. కేంద్రం దీనికి వెచ్చిస్తున్న నిధులను, పనిదినాలను గ్రామీణుల జీవనస్థితిగతులు మార్చడానికి ఉపయోగించుకోవచ్చు. పెనమలూరు నియోజకవర్గం, కంకిపాడులో జరుగుతున్న ఈ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కంకిపాడు – రొయ్యూరు వయా గోడవరం రోడ్డును నవీకరణ చేయాలని కోరారు. వెంటనే దానిపై తగు చర్యలు తీసుకొని రోడ్డు వేసేలా ముందుకు వెళ్తాం. అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గారు ఎదురుమొండి – గొల్లమంద పరిధిలోని లంక గ్రామాల్లో అనుసంధాన రహదారులు కావాలని ప్రతిపాదించారు. వీటిని కూడా పూర్తి చేసేలా ఆదేశాలు ఇస్తున్నాను. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నందివాడ, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లోని 43 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని, అక్కడ నీటిని ఓ బాటిల్ లో పట్టి మరీ సమస్య చెప్పారు. దీనిపై గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా శాఖ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అక్కడి సమస్యను తీర్చాలని ఆదేశిస్తున్నాను. దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటాం. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్పదల్చుకున్నాను. గత ప్రభుత్వంలో 151 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపిస్తే ప్రజా సమస్యల కోసం ఇలా చెప్పిన దాఖలాలు లేవు. ఎప్పుడూ బూతులు, తిట్లు తప్ప గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు చేసింది శూన్యం. కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు బాధ్యతగా నడుచుకోవడం ముచ్చటగా ఉంది. ఎంతోకాలంగా పెండింగ్ లో మచిలీపట్నం – రేపల్లె రైల్వే లైను విషయాన్నిప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తాను అన్ని తెలిపారు.

• సుందర గ్రామాలు సాకారం కావాలి

చిత్తశుద్ధి, పారదర్శకత, అభివృద్ధి కాంక్షతో పనులన్నీ చేస్తున్నాం. పనులతో గ్రామాలు సుందరం కావాలి. పల్లెల్లో మెరిసిపోవాలి. రోడ్లు, గోకులాలు, పాఠశాలలకు ప్రహరీలు, ఉద్యానవనాలు, ట్రెంచ్ లు, రూఫ్ టాప్ లు, పారిశుద్ధ్య పనులు ఇలా ప్రాధాన్యం ఉన్న పనులన్నీ తీసుకున్నాం అన్నారు. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో 3 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 120 పాఠశాలలకు ప్రహరీలు, ప్రభుత్వ కార్యాలయ భవనాలకు రూఫ్ టాప్స్, సామాజిక భవనాలు రావాలని భావిస్తున్నాం అన్నారు. అలాగే ఆర్థిక సంవత్సరంలో 25.50 కోట్ల పని దినాలు, 8 లక్షల కుటుంబాలకు 100 రోజుల పని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఊరి అభివృద్ధి కోసం జరుగుతున్న పల్లె పండుగలో గ్రామస్థులంతా ఉమ్మడిగా పాలు పంచుకోవాలి. దీనిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గ్రామం కోసం కదలిరండి అన్ని పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేనంత అభివృద్ధిని గ్రామాల్లోకి తీసుకొస్తున్న ఈ శుభతరుణంలో ప్రజలందరి భాగస్వామ్యం అవసరమన్ని.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా ఈ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు ముందుండి నడిపించాలన్నారు.

Next Story