పోలవరం-నల్లమల సాగర్ వల్ల ఎవరికీ నష్టం ఉండదు : మంత్రి నిమ్మల

గోదావరి నదికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం - నల్లమల సాగర్ ప్రాజెక్ట్ వల్ల ఎవరికీ నష్టం లేదని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి స్పష్టం చేశారు.

By -  Medi Samrat
Published on : 12 Jan 2026 5:25 PM IST

పోలవరం-నల్లమల సాగర్ వల్ల ఎవరికీ నష్టం ఉండదు : మంత్రి నిమ్మల

గోదావరి నదికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం - నల్లమల సాగర్ ప్రాజెక్ట్ వల్ల ఎవరికీ నష్టం లేదని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు సిజేఐ సూచనల మేరకు ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ వేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో సోమవారం రామానాయుడు ఈ విషయమై స్పందించారు.

పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు పై తెలంగాణా అభ్యంతరాలను సుప్రీం కోర్టు డిస్పోజ్ చేయడంపై మంత్రి నిమ్మల మాట్లాడుతూ, ఉభయ తెలుగు రాష్ట్రాలు బాగుండాలని మొదటి నుంచీ, కోరుకుంటున్నామని చెప్పారు. ఏటా వృధాగా సముద్రంలో కలుస్తున్న 3వేల టిఎంసిల నీటిలో 200 టిఎంసిలు మాత్రమే వాడుకుంటామని స్పష్టంగా చెబుతున్నాం. అపోహలు విడనాడి ఇప్పటికైనా సహకరించమని రామానాయుడు కోరారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణాకు ఎటువంటి నష్టం లేదని ముందునుండి మేం చెబుతూనే ఉన్నామన్నారు. తెలుగు రాష్ట్రాలు సోదరభావంతో కలసి అభివృద్ధి చెందాలనే సిఎం చంద్రబాబు ఆకాంక్షను ఈ సందర్భంగా రామానాయుడు మరోసారి గుర్తు చేశారు.

గత 50 ఏళ్ళలో గోదావరి వరదనీరు 1,53,000 టిఎంసిల నీరు వృధాగా సముద్రంలో కలిసి పోయిన సంగతి గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందారు. ఈ సంవత్సరం కూడా 4600 టిఎంసిల నీరు వృధాగా సముద్రంలోకి పోయిందని తెలిపారు.

రాష్ట్ర విభజన జరిగిన తరువాత గోదావరి ఎగువన కాళేశ్వరం కు ఏమాదిరిగా అనుమతి ఇచ్చారో, ఆవిధంగా దిగువన పోలవరం-నల్లమలసాగర్ కు అనుమతి ఇవ్వమంటున్నాం. మా కోరిక సమంజసమైనది, సహేతుకమైనది. సహజ న్యాయ సూత్రాలకు లోబడినదని ఆయన అన్నారు. పోలవరం దగ్గర వరద నీరును ఉపయోగించుకుంటే, ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకోవాలి, లేదంటే సముద్రంలో ఉప్పునీటిలో కలిసిపోతుంది. అలాంటప్పుడు తెలంగాణకు నష్టం జరిగే ప్రశ్నే లేదన్నారు.

గోదావరిలో పుష్కలంగా నీరు ఉందనే ఆనాడు రాష్ట్ర విభజన తర్వాత కాళేశ్వరాన్ని తెలంగాణ నిర్మాణం చేస్తున్నా, మేము అడ్డుకోకుండా సహకరించామన్నారు. పోలవరం-నల్లమలసాగర్ పూర్తైతే మనరాష్ట్ర ప్రయోజనాలు తీరిన తరువాత తెలంగాణకు సైతం ఉపయోగం ఉంటుందన్నారు.

Next Story