మార్గదర్శిలో జరిగింది ఆర్థికనేరం.. అందుకే బయటకు తీశాను : ఉండవల్లి అరుణ్ కుమార్
మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
By Medi Samrat Published on 12 April 2024 4:15 PM GMTమార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. మార్గదర్శి పేరిట రామోజీ పాల్పడ్డ ఆర్థిక నేరాలపై పూర్తి విచారణ తెలంగాణ హైకోర్టులో జరగనుందని అన్నారు. ఈ వ్యవహారం ఆరు నెలలలో తేల్చమని సుప్రీంకోర్టు చెప్పిందని.. ఏదో ఒక లాజికల్ కంక్లూజన్ వస్తుందని భావిస్తున్నానన్నారు ఉండవల్లి అరుణ్‌కుమార్. మార్గదర్శిలో జరిగింది ఆర్థికనేరం.. ఒక ఇష్యూలో తప్పు జరిగింది.. ఒక వ్యక్తి తప్పు చేస్తే మనం కళ్లు మూసుకుపోవాలా?. అందుకే ఈ విషయాన్ని బయటకు తీశానన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.
రామోజీరావు పాల్పడ్డ ఆర్థిక అక్రమాల వ్యవహారంలో నిజాలు బయటకు రావాలన్నదే తనకు కావాల్సిందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఇదే విషయాన్ని సిద్ధార్థ్ లూథ్రాకు కూడా చెప్పానని అన్నారు. భావవ్యక్తీకరణను ఏ రకంగా చంపేస్తారో.. ఈనాడు అలాంటి రాతలను ఇన్ని సంవత్సరాల్లో అనేకంగా రాసిందని అన్నారు. డిపాజిటర్ల సమస్యలను thedepositers@gmail.com కు ఈ మెయిల్ చేయాలని కోరారు. 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని ఉండవల్లి అన్నారు. ఎంతమంది ఖాతాదారులకు డబ్బులు వెనక్కిచ్చారన్న విషయాన్ని పరిశీలించడానికి ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని జ్యుడీషియల్ అధికారిగా ఏర్పాటు చేశారన్నారు. 80 నిమిషాల పాటు ఇండియాలో ఉన్న టాప్ అడ్వకేట్స్ ముగ్గురు రామోజీరావు తరపున దీనిపై వాదనలు వినిపించారని.. ఈ కేసులో న్యాయం జరిగిందంటే కేవలం జడ్జిల వల్ల జరిగిందని భావించాలన్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అందజేసిన మెచూరిటీ అమౌంట్‌కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఖాతాదారుల దగ్గర ఉన్న ఆధారాలు, పూర్తి అడ్రస్‌తో జీమెయిల్‌కి పంపాలని కోరారు.