విజయనగరం యువతి కేసు మిస్టరీ వీడింది..!
Vizianagaram Lady Case Mystery. రాష్ట్ర వ్యాప్తంగా సంచలం సృష్టిన విజయనగరం యువతి కేసు మిస్టరీ వీడింది.
By Medi Samrat
రాష్ట్ర వ్యాప్తంగా సంచలం సృష్టిన విజయనగరం యువతి కేసు మిస్టరీ వీడింది. గుర్ల పీఎస్ వద్ద తానే కాళ్లు, చేతులు కట్టేసుకుని నాటకమాడినట్లు పోలీసులకు తెలిపింది. అలా ఎందుకు చేయాల్సివచ్చిందో వివరించింది. విజయనగరం జిల్లా గుర్ల పీఎస్ వద్ద అచేతన స్థితిలో కనిపించిన యువతి మిస్టరీ కేసు వీడింది. కుటుంబసభ్యులను నమ్మించేందుకు యువతి కట్టు కథ అల్లినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకుంది. స్నేహితులతో బయటకు వెళ్లినట్లు ఇంట్లో తెలిసిపోతుందని యువతి నాటకమాడినట్లు తెలిపింది. కుటుంబసభ్యులను నమ్మించేందుకు తానే కాళ్లు, చేతులు కట్టుకున్నానని వివరించింది.
మార్చి 1న ఉదయం గుర్ల పోలీసు ఠాణా సమీపంలోని పొదల్లో నుంచి అరుపులు వినిపించడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ లీలావతి, సిబ్బంది అక్కడకు చేరుకొని అక్కడ ఓ యువతి పడి ఉండడంతో ఆమెను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. క్లూస్ టీం, పోలీసు జాగిలాలు పరిసర ప్రాంతాలను పరిశీలించాయి. విచారణలో భాగంగా ఆమె విజయనగరం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్న తెర్లాం మండలానికి చెందిన విద్యార్థినిగా గుర్తించారు. ఫిబ్రవరి 26న తరగతి గదిలో ఆ విద్యార్థిని పడిపోయింది. వెంటనే కళాశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
విజయనగరంలోనే ఉంటున్న తన బంధువుతో కలిసి ఆసుపత్రికి వెళ్లి సోమవారం వస్తానని యువతి చెప్పి వెళ్లినట్లు తెలిపారు. అయితే ఫిబ్రవరి 28న ఆమె తన ఇంటికి చేరుకోలేదని కళాశాల సిబ్బందికి ఫోన్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే మార్చి 1న ఉదయం ఈ ఉదంతం వెలుగు చూసింది. పోలీసుల విచారణ సమయంలో మెుదట ఏం జరిగిందనేది చెప్పలేదు.బాబాయి ఇంటికి వెళ్తానని చెప్పి.. తర్వాత స్నేహితులతో కలిసి బయటకు వెళ్లినట్లు పోలీసుల ఎదుట యువతి ఒప్పుకుంది. ఈ విషయం ఇంట్లో తెలిసిపోతుందని భయంతో.. కుటుంబసభ్యులను నమ్మించేందుకు తానే కాళ్లు, చేతులు కట్టేసుకుని నాటకమాడినట్లు అంగీకరించింది.