విశాఖలో సమ్మె సైరన్ మోగించారు.. ఆయనకి నోటీసులు..!

Vizag Steel Plant workers to go on strike. విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యోగుల ఆందోళన ఉద్ధృతమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న

By Medi Samrat  Published on  11 March 2021 2:44 PM IST
Vizag Steel Plant workers to go on strike

విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యోగుల ఆందోళన ఉద్ధృతమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సమ్మె నోటీసు ఇచ్చింది. ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలని, సీతమ్మధార భూముల విక్రయ ఒప్పందం రద్దు చేయాలని, పోస్కోతో జరిగిన ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ ఉక్కు సీఎండీకి గురువారం సమ్మె నోటీసు అందజేశారు. ఆర్‌- కార్డు ఉన్న నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

14 రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని ఉక్కుపరిరక్షణ పోరాట కమిటీ స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు, అమ్మేదెవరు.. కొనేదెవరు.. అంటూ ఉక్కు ఉద్యోగులు, నిర్వాసితులు, ఉద్యమకారులు నినాదాలతో గత కొన్ని రోజులుగా విశాఖలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తున్నామని సోమవారం పార్లమెంటులో కేంద్ర ఆర్థికమంత్రి చేసిన ప్రకటనతో నిరసనలు మరింత ఉద్ధృతమైన విషయం తెలిసిందే.

ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు మంగళవారం ఉదయం స్టీలుప్లాంటు పరిపాలన భవనాన్ని ఉద్యోగులు ముట్టడించారు. ఈ క్రమంలో స్టీలుప్లాంటు డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) వేణుగోపాలరావు రాగా.. ఆయన కారును చుట్టుముట్టి కదలకుండా ఆపేశారు. సుమారు ఆరు గంటల పాటు డైరెక్టర్‌తో పాటు హెచ్‌ఆర్‌ విభాగం ఈడీ బాలాజీని చెట్టు కిందే నిలబెట్టేశారు. ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.


Next Story