విశాఖ వాసులకు గుడ్‌న్యూస్‌.. రూ.11,498 కోట్లతో తొలిదశ మెట్రో

విశాఖ వాసులకు గుడ్‌న్యూస్‌. విశాఖలో 76.90 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్టుపై పంపిన డీపీఆర్‌ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో తెలిపారు.

By అంజి  Published on  14 Nov 2024 7:28 AM IST
Vizag Metro Rail, Central Govt, minister narayana, APnews

విశాఖ వాసులకు గుడ్‌న్యూస్‌.. రూ.11,498 కోట్లతో తొలిదశ మెట్రో

విశాఖ వాసులకు గుడ్‌న్యూస్‌. విశాఖలో 76.90 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్టుపై పంపిన డీపీఆర్‌ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో తెలిపారు. తొలి దశలో 3 కారిడార్లలో 46 కిలోమీటర్ల మేర నిర్మించడానికి రూ.11,498 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. దీనికి 100 శాతం నిధులూ కేంద్రమే భరించేలా ప్రతిపాదినలు పంపామని, అక్కడి నుంచి అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

ఒకటో కారిడార్‌లో స్టీల్‌ ప్లాంట్‌ నుంచి కొమ్మాది కూడలి వరకు (34.4 కిలోమీటర్లు), రెండోది గురుద్వారా - ఓల్డ్‌ పోస్టాఫీస్‌ వరకు (5.07 కిలోమీటర్లు), మూడో కారిడార్‌లో తాటిచెట్ల పాలెం - చినవాల్తేరు వరకు (6.75 కిలోమీటర్ల) వరకు పనులు చేయాల్సి ఉందని మంత్రి తెలిపారు. రెండో విడతలో కొమ్మాది జంక్షన్‌ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ వరకు 30.67 కిలోమీటర్ల మేర 12 స్టేషన్లతో ప్రతిపాదనలు పంపామని మంత్రి తెలిపారు. పర్మిషన్‌ త్వరగా ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారని మంత్రి తెలిపారు. మెట్రో మార్గంలో ఎక్కువ క్రాసింగ్స్‌ వస్తుండటంతో పలు చోట్ల టూ లెవల్‌ మెట్రో, ఫ్లైఓవర్‌లు నిర్మించే ప్రతిపాదనలూ సిద్ధం చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు.

Next Story