వివేకా హ‌త్య కేసు: సీబీఐ తుది చార్జిషీట్‌లో సంచ‌ల‌న విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో.. సీబీఐ తాజాగా హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

By అంజి  Published on  21 July 2023 7:34 AM GMT
Viveka murder case, CBI, charge sheet, CBI Court, APnews

వివేకా హ‌త్య కేసు: సీబీఐ తుది చార్జిషీట్‌లో సంచ‌ల‌న విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో.. సీబీఐ తాజాగా హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. వివేకా హత్యకు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌ రెడ్డి కుట్ర చేశారని సీబీఐ తెలిపింది. గతంలో దాఖలు చేసిన ఛార్జిషీట్లలోనూ వీరి పేర్లు పేర్కొన్నా ఈసారి వీరిని ఏ 7, ఏ8లుగా పేర్కొంది. ఈ కేసులో సీబీఐ విస్తృతంగా దర్యాప్తు చేసి ఆధారాలు సంపాదించింది. హత్యకు సంబంధించిన కుట్ర కోణాన్ని వెల్లడిస్తూ సీబీఐ తాజా ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో నిందితులుగా, అనుమానితులుగా ఉన్న పలువురి పేర్లు, వారి పాత్రను కూడా సీబీఐ పేర్కొంది. కుట్ర, హత్య సాక్ష్యాల చెరిపివేతను కోర్టుకు వివరించిన సీబీఐ.. గూగుల్ టేక్ అవుట్, ఫోన్ల లొకేషన్ డేటాలు, ఫొటోలను సమర్పించింది. వివేకా హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోందని, అయితే వివేకా పీఏ కృష్ణారెడ్డిపై అనుమానాలు ఉన్నప్పటికీ తగిన ఆధారాలు లభించలేదని తెలిపింది.

మరోవైపు వివేకా హత్య తర్వాత ఆధారాల ధ్వంసం విషయంలో మిగతా నిందితులకు వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు మనోహర్ రెడ్డి కూడా సహకరించినట్లు సీబీఐ పేర్కొంది. అయితే హత్య కుట్ర విషయంలో మాత్రం ఆయన ప్రమేయంపై ఆధారాలు లభించలేదని తెలిపింది. వివేకా హత్య జరిగిన సమయంలో ఆయన ఇంట్లో వైఫై రూటర్ కు కనెక్ట్ అయిన ఫోన్లు, వాటి లొకేషన్లు తెలుసుకుంటున్నట్లు సీబీఐ పేర్కొంది. అలాగే వివేకా రాసిన లేఖపై వేలిముద్రల్ని గుర్తించేందుకు జరిపిన నిన్ హైడ్రిన్ పరీక్ష ఫలితాలు ఇంకా అందాల్సి ఉందని కూడా తెలిపింది. గ‌తంలో వేసిన చార్జిషీట్‌లో గూగుట్ టేక్ అవుట్‌కు సంబంధించిన స‌మాచారం త‌ప్ప‌ని తుది చార్జిషీట్‌లో సీబీఐ పేర్కొంది. వివేకా హ‌త్య కేసులో నిందితుల‌ను గూగుల్ టేక్ అవుట్ ప‌ట్టించింద‌ని ఇంత కాలం సీబీఐ చెబుతూ వ‌చ్చింది. గూగుల్ టేక్ అవుట్ ఆధారంగానే క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్క‌ర్‌రెడ్డిని సీబీఐ నిందుతులుగా పేర్కొంది నిందితులు సునీల్ యాద‌వ్‌, ఉద‌య్‌కుమార్‌రెడ్డి క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంట్లోనూ, ఇంటి ప‌రిస‌రాల్లోనూ ఉన్నార‌ని గూగుల్ టేక్ అవుట్ ద్వారా తెలుసుకున్న‌ట్టు సీబీఐ తెలిపింది.

ప్రాథమిక చార్జిషీట్‌లో పేర్కొన్న అంశాలు తుది చార్జిషీట్‌లో మార్పులు చేశామని సీబీఐ తెలిపింది. వివేకానంద‌రెడ్డి ఇంట్లో 2019, మార్చి 14న రాత్రి సునీల్ యాద‌వ్‌ వున్నాడు. అర్ధరాత్రి దాటాక 2.35 గంట‌ల‌కు వివేకా నివాసం స‌మీపంలో, 2.42 గంట‌ల‌కు నివాసం లోప‌ల ఉన్నాడు. సునీల్ సెల్ నెంబ‌ర్ గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించామని సీబీఐ గ‌తంలో పేర్కొంది. తాజాగా తుది నివేదిక‌లో నిజం కాద‌ని సీబీఐ కోర్టుకు స‌మ‌ర్పించిన చార్జిషీట్‌లో స్ప‌ష్టం చేసింది. ''వివేకా ఇంట్లో 2019, మార్చి 14 అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత సునీల్ యాద‌వ్ లేడు. 2019, మార్చి 15న ఉద‌యం 8.05 గంట‌ల‌కు వివేకా ఇంటి బ‌య‌ట‌, 8.12 గంట‌ల‌కు ఇంటిలోప‌ల ఉన్నాడు.

గ‌తంలో యూటీసీ గ్రీన్‌విచ్ కాల‌మానం ప్ర‌కారం గూగుల్ టేక్ అవుట్ ద్వారా తెలుసుకున్నాం. కానీ ఏ దేశంలోనైనా స్థానిక కాల‌మానం ప్ర‌కారమే చూడాలి. ఐఎస్‌టీ భార‌త కాల‌మానం ప్రకారం దానికి 5.30 గంట‌ల స‌మ‌యం క‌ల‌పాలి. గ‌తంలో స‌మాచార సేక‌ర‌ణ‌లో పొరపాటు జరిగింది'' అని సీబీఐ తన తాజా చార్జిషీట్‌లో పేర్కొన్నారు. క‌డ‌ప ఎంపీ సీటు హ‌త్య‌కు దారి తీసింద‌నే వాద‌న‌ గతంలో సీబీఐ వాదన వినిపించింది. వైఎస్ ష‌ర్మిల వాంగ్మూలంలో వివేకానంద‌రెడ్డి క‌డ‌ప ఎంపీ సీటును ఆశించ‌లేద‌ని వైఎస్ ష‌ర్మిల వాంగ్మూలం ఇచ్చిన‌ట్టు సీబీఐ పేర్కొంది. ఎంపీగా పోటీ చేయాల‌ని తనను కోరార‌ని కానీ త‌న‌కు క‌డ‌ప రాజ‌కీయాల‌పై ఆస‌క్తి లేద‌ని చిన్నాన్న‌కు స్ప‌ష్టం చేసిన‌ట్టు ష‌ర్మిల వాంగ్మూలం ఇచ్చారు. జరుగుత్న ప్రచారానికి పూర్తి విరుద్ధంగా సీబీఐ తుది చార్జిషీట్ దాఖలు చేసింది.

Next Story