జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు విశాఖపట్నం పోలీసులు నోటీసులు పంపారు. 41ఏ కింద పవన్ కల్యాణ్‌కు విశాఖ ఈస్ట్ ఏసీపీ హర్షిత చంద్ర నోటీసులు పంపారు. ఈ నెలాఖరు వరకు పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉంది. విశాఖపట్నంలో సభలు, ర్యాలీలు, రోడ్‌షోలకు పర్మిషన్ లేదు అని నోటీసుల్లో పేర్కొన్నారు. విశాఖలో సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పుడు.. నిబంధనలు ఉల్లంఘించి భారీ ర్యాలీ నిర్వహించినందుకు పవన్ కల్యాణ్‌కు నోటీసులు పంపినట్లు పోలీసులు తెలిపారు.
500 మందికిపైగా ప్రజలతో ర్యాలీ చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదే సమయంలో విశాఖపట్నం పోలీసులు పవన్ కళ్యాణ్‌తో చర్చలు చేసారు. సాయంత్రం నాలుగు గంటల లోగా విశాఖ వదిలి వెళ్లిపోవాలని సూచించారు. శాంతి భద్రతల సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇదే లిఖిత పూర్వకంగా తెలియచేస్తూ నోటీసులు ఇచ్చారు. పవన్ తో పాటుగా జనసేన ముఖ్య నేతలకూ నోటీసులు అందించారు. దీని పైన పవన్ మండిపడ్డారు. నేరు చరిత్రుల చేతిలో అధికారం ఉంటే ఇలాగే ఉంటుందని పవన్ కామెంట్ చేశారు.
ప్రశ్నించే తత్వం లేకపోతే దోపిడీలు ఎక్కువైపోతాయని పవన్ అన్నారు. ప్రజల కోసం పోరాడి నోటీసులు ఇస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాము విశాఖకు రాకముందే గొడవ జరిగిందని, కానీ తాము రెచ్చగొట్టడం వల్లే గొడవ జరిగినట్టుగా పోలీసులు నోటీసులు ఇచ్చారన్నారు. ఉత్తరాంధ్ర దోపిడీని చూపిస్తామనే కారణంతోనే డ్రోన్లను నిషేధించారన్నారు. ప్రజల్లో మార్పు వచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని, ఎన్ని కేసులు పెట్టినా, జైలుకెళ్లేందుకైనా సిద్ధమేనని పవన్ అన్నారు.