సుజనా చౌదరి Vs ఆసిఫ్ : విజయవాడ వెస్ట్ విజేత ఎవ‌రు.?

ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ పశ్చిమ అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్, భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి వై.సత్యనారాయణ చౌదరి అలియాస్‌ సుజనా చౌదరి మధ్య బలమైన రాజకీయ పోటీ నెలకొని ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 May 2024 8:25 AM IST
సుజనా చౌదరి Vs ఆసిఫ్ : విజయవాడ వెస్ట్ విజేత ఎవ‌రు.?

ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ పశ్చిమ అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్, భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి వై.సత్యనారాయణ చౌదరి అలియాస్‌ సుజనా చౌదరి మధ్య బలమైన రాజకీయ పోటీ నెలకొని ఉంది.

షేక్ ఆసిఫ్

షేక్ ఆసిఫ్.. మాజీ కార్పొరేటర్, AP మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 2024 ఎన్నికలలో విద్య, రోడ్ కనెక్షన్, మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొండ ప్రాంతాల నివాసితులకు నీటి వసతి వంటి రంగాలలో వైఎస్ జగన్ ప్రభుత్వం నియోజకవర్గంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివ‌రిస్తూ ఆయ‌న ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు.

సుజనా చౌదరి బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ద్వారా సమర్థవంతమైన పాలన, పారదర్శకత, జవాబుదారీతనంగా ఉంటాన‌ని హామీ ఇస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. సుజనా చౌదరి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.

2019 ఎన్నికల్లో మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జలీల్ ఖాన్ కుమార్తె, టీడీపీ అభ్యర్థి షబానా ముసరత్ ఖాతూన్‌పై ఆయన విజయం సాధించారు.

పార్టీ సోషల్ ఇంజినీరింగ్ విధానంలో భాగంగా సీఎం జగన్ విజయవాడ పశ్చిమ నుంచి షేక్ ఆసిఫ్‌ను, ప్రస్తుత ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు.

అభ్యర్థులు, పార్టీలపై ప‌బ్లిక్ టాక్‌

వన్ టౌన్‌లో కిరాణా దుకాణం నడుపుతున్న అంగులూరి కిరణ్, NewsMeterతో మాట్లాడుతూ.. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న పారిశ్రామికవేత్తగా బీజేపీ సుజనా చౌదరి గురించి మాకు తెలుసు. సుజనా చౌదరి తన గెలుపు కోసం 150 కోట్లు ఖర్చు చేసినా.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గెలవరు. ఆయ‌న‌ గెలిస్తే.. మాకు అందుబాటులో ఉండడు కాబట్టి.. ఇక్కడి ప్రజలు తమ బాధలను వివరించడానికి న్యూఢిల్లీకి వెళ్లాలి, ”అని కిరణ్ అన్నారు.

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్‌ ఆసిఫ్‌ గురించి అడిగిన ప్రశ్నకు కిరణ్‌ బదులిస్తూ.. ఆసిఫ్‌ తనకు కార్పొరేటర్‌గా తెలుసని.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కూడా పనిచేశారన్నారు.

“ఆయ‌న‌ గెలిచినా, ఓడినా ఆసిఫ్ అంకితభావం ఉన్న నాయకుడు. ఆయ‌న‌ స్థానిక అభ్యర్థి. ప్ర‌జ‌ల‌కు చేరువగా ఉంటాడు. సుజనా చౌదరి సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండ‌డు. స్థానికుడు కాదు. నియోజకవర్గంలోని మొత్తం 22 డివిజన్లలో 12 డివిజన్లు కొండలపైనే ఉన్నాయి. సుజనా చౌదరికి నియోజకవర్గ జనాభాపై అవగాహన లేదు. సుజనా చౌదరి తన వనరులను, ప్రభావాన్ని ఉపయోగించి ఎన్నికల్లో గెలిచినా.. ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలకు ఇవ్వడానికి ఎంత ఖర్చు చేస్తారు? అని అత‌డు ప్ర‌శ్నించాడు.

విజయవాడ వెస్ట్‌లో టీడీపీ..

1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ ఒక్కసారి విజయం సాధించిందని గృహిణి ఎస్ సరిత తెలిపారు.

వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారు. సంక్షేమ పథకాలకు ఆటంకం కలిగించడమే కాకుండా అభివృద్ధి విషయంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పలు మోసాలకు పాల్పడ్డారు. నియోజకవర్గంలోని పలు రోడ్లు, డ్రెయిన్లు అధ్వానంగా ఉన్నాయని ఆమె అన్నారు.

ఎమ్మెల్యేగా సుజనా చౌదరి గెలుపు అవకాశాల గురించి అడిగిన ప్రశ్నకు సరిత.. “స్థానికమైనా, స్థానికేతరైనా అభ్యర్థికి ప్రజల పట్ల నిబద్ధత ఉండాలి. YSRCP నాయకత్వానికే ప్రజల పట్ల నిబద్ధత లేదని నేను భావిస్తున్నాను. షేక్ ఆసిఫ్ YSRCP తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మేం ఏం ఆశించగలం? సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో విజయవాడకు అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మంజూరు చేయడంలో కీలక పాత్ర పోషించారు.

తాగునీరు, డ్రైనేజీ ముఖ్యమైన పోల్ పాయింట్లు

నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై అభ్యర్థులెవరూ దృష్టి సారించలేదని టెక్కీ ఎం సంపత్ కుమార్ అభిప్రాయపడ్డారు.

2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి నియోజకవర్గంలో అవకాశం ఇచ్చారు. గుట్టలపై తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను అపరిష్కృతంగానే మిగిలిపోయింది అని ఆయన అన్నారు. సంక్షేమ పంపిణీతో పాటు నియోజకవర్గంలో మౌలిక అభివృద్ధిపై కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు.

ప్రస్తుత అభ్యర్థుల రేసు గురించి ఆయన మాట్లాడుతూ.. పోతిన మహేష్ జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అనుకున్నాను. అయితే, టీడీపీ-బీజేపీతో భాగస్వామ్యంలో భాగంగా సుజనా చౌదరికి అవకాశం కల్పించారు. సుజనా చౌదరి టీడీపీ అనుకూల ఓట్లు పొందుతారు. జనసేన ఓటు బదిలీ అవుతుందో లేదో ఆసక్తికరంగా ఉంది. ఇక మైనారిటీ ఓటర్లు బిజెపికి ఓటు వేయడానికి ఇష్టపడరు. వైఎస్ జగన్ ప్రారంభించిన సంక్షేమ పథకాల ద్వారా షేక్ ఆసిఫ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

విజయవాడ పశ్చిమ అసెంబ్లీ..

విజయవాడ పశ్చిమ అసెంబ్లీ విజయవాడ లోకసభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. 1967లో డీలిమిటేషన్ లో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. వెల్లంపల్లి శ్రీనివాసరావు 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో YSRCP నుండి గెలిచి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నారు.

మొత్తం పోలైన ఓట్లలో 38.04 శాతం ఓట్లతో వెల్లంపల్లి టీడీపీ అభ్యర్థి షబానా ముసరత్ ఖాతూన్‌పై విజయం సాధించారు. అప్పుడు జనసేనలో ఉన్న పోతిన మహేష్‌కు 14.56 శాతం ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్, సీపీఐ మూడుసార్లు, వైఎస్సార్‌సీపీ రెండుసార్లు, ప్రజారాజ్యం, టీడీపీ ఒకసారి విజయం సాధించాయి.

2019 నాటికి, నియోజకవర్గంలో మొత్తం 2,32,555 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మైనారిటీలు నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు, ఆ తర్వాత బీసీలు, వైశ్యులు, జైన సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు గణనీయమైన సంఖ్యలో ఉన్నాయి. మరుపిళ్ల చిట్టి, పోతిన చిన్నా, MK బేగ్, K సుబ్బ రాజు, షేక్ నాసర్వల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ప్రముఖ నాయకులు.

Next Story