ఆయన మనసులో స్థానం లేదు, అందుకే బయటికి వచ్చేశా..విజయసాయి ఆసక్తికర వ్యాఖ్యలు
వైసీపీకి రాజీనామా చేయడంపై మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 12 March 2025 4:34 PM IST
ఆయన మనసులో స్థానం లేదు, అందుకే బయటికి వచ్చేశా..విజయసాయి ఆసక్తికర వ్యాఖ్యలు
వైసీపీకి రాజీనామా చేయడంపై మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పోర్టు వాటాలను బలవంతంగా బదిలీ చేయించుకున్నారన్న కేసులో నిందితుడిగా ఉన్న ఆయన సీఐడీ విచారణ ముగిసింది. విచారణ అనంతరం ఆయన మీడియాలో మాట్లాడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఎదగడానికి తనను కొందరు కిందకు లాగారని ఆయన అన్నారు. వైసీపీ అధినేత జగన్ చుట్టూ ఉన్న కోటరీ కారణంగా ఆయనకు తీవ్ర నష్టం జరుగుతోందని చెప్పారు. కోటరీ నుంచి బయటకు రాకపోతే జగన్ కు రాజకీయ భవిష్యత్తు ఉండదని అన్నారు. తన మనసులో జగన్ కు సుస్థిరమైన స్థానం ఉందని విజయసాయి చెప్పారు. జగన్ మనసులో మాత్రం తనకు స్థానం లేదని... అందుకే తాను పార్టీ నుంచి బయటకు వచ్చేశానని తెలిపారు. కోటరీ వల్లే తాను జగన్ కు దూరమయ్యానని చెప్పారు. కోటరీ మాటలు వినొద్దని జగన్ కు స్పష్టంగా చెప్పానని తెలిపారు. భవిష్యత్తుల్లో మళ్లీ వైసీపీలో చేరే అవకాశమే లేదని స్పష్టం చేశారు. విరిగిపోయిన మనసు మళ్లీ అతుక్కోదని అన్నారు. ఏ పార్టీలో చేరాలనేదానిపై తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
నాయకుడు అనేవాడు చెప్పుడు మాటలు వినకూడదని విజయసాయి అన్నారు. చెప్పుడు మాటలు వింటే... ఆ నాయకుడే కాదు... ప్రజలు, పార్టీ కూడా నష్టపోకతప్పదని చెప్పారు. తనకు, జగన్ మధ్య కొందరు విభేదాలు సృష్టించారని తెలిపారు. కోటరీకి అనుకూలంగా ఉంటేనే జగన్ వద్దకు తీసుకెళతారని చెప్పారు. జగన్ వద్దకు ఎవరినైనా తీసుకెళ్లాలంటే... కోటరీకి లాభం చేకూర్చాల్సి ఉంటుందని తెలిపారు. జగన్ బాగుండాలనే పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తాను కోరుకుంటున్నానని అన్నారు. కోటరీ నుంచి బయట పడకపోతే జగన్ భవిష్యత్తు కష్టంగా ఉంటుందని చెప్పారు. పార్టీలో తనకు ఎన్నో పదవులు ఇచ్చారని... దీన్ని తాను కాదనడంలేదని చెప్పారు. కానీ, తనను ఎన్నో విధాలుగా అవమానించారని, కష్టపెట్టారని... తన మనసు విరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఉండాలని జగన్ తనను కోరినప్పటికీ తాను ఒప్పుకోలేదని చెప్పారు.
జగన్ కు ఫోన్ చేసి ఇదే చెప్పా "సజ్జల, భారతీ చెప్పుడు మాటలు విని నువ్వు నాశనం అయిపోయావ్..నీ మనసులో నాకు స్థానం లేదు..నా మనసు విరిగిపోయింది.."#VijayasaiReddy #Andrapradesh pic.twitter.com/Lid5ofLeGG
— TDP Trends (@Trends4TDP) March 12, 2025