దళిత యువకుడిపై దాడికేసు..వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ ఎదురైంది.
By Knakam Karthik
దళిత యువకుడిపై దాడికేసు..వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ ఎదురైంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు వ్యవహారంలో వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగిస్తూ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఏప్రిల్ 8న విచారణలో భాగంగా న్యాయమూర్తి వంశీకి ఈ నెల 22 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ్టితో రిమాండ్ ముగియనుండటంతో వంశీ కస్టడీని మరోసారి పొడిగించాలని పోలీసుల తరపు న్యాయవాది కోర్టు వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీతో పాటు మరో నలుగురు నిందితులకు మే 6వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.
అటు మరో కేసులోనూ వల్లభనేని వంశీకి షాక్ తగిలింది. స్థలం ఆక్రమణ కేసుకు సంబంధించి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు సోమవారం విచారించింది. కేసుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవాల్సి ఉందని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో, కేసును హైకోర్టు వారంపాటు వాయిదా వేసింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విజయవాడ జైల్లో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసు, సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసు, స్థలం ఆక్రమణ కేసులు మూడింటిలోనూ వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు