అక్కడికి రాకండి.. బీచ్ రోడ్డు మూసివేత
కాకినాడకు దగ్గరగా ఉన్న ఉప్పాడ బీచ్ రోడ్డును అధికారులు మూసివేశారు.
By - Medi Samrat |
కాకినాడకు దగ్గరగా ఉన్న ఉప్పాడ బీచ్ రోడ్డును అధికారులు మూసివేశారు. మొంథా తుపాను ఎఫెక్ట్ నేపథ్యంలో మెరైన్ పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్ర కెరటాల ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉండడంతో బీచ్ వద్దకు ఎవరినీ అనుమతించడంలేదు. ఇప్పటికే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. సముద్ర సమీప ప్రాంత ప్రజలను పుసరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
మొంథా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో రానున్న కొద్ది రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అదనపు బృందాలను కూడా అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. రేపటి నుంచి 29 వరకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి (యానాం), ఒడిశా తీరాల వెంబడి మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని ఐఎండీ ఆదేశాలు జారీ చేసింది.