కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పేర్కొంటూ.. 2022 - 23 బడ్జెట్‌లో కొన్ని నిధుల కేటాయింపులు చేసింది. పరిపాలనా భవనాలు, నివాస గృహాలకు నిధులు కేటాయించింది. 2022-23 కేంద్ర బడ్జెట్‌లో గ్రాంట్ల కోసం వివరణాత్మక డిమాండ్లలో ప్రస్తావన, నిధుల కేటాయింపు జరిగింది. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని అమరావతిలో ఉమ్మడి కేంద్ర సచివాలయం నిర్మాణం" కోసం మంత్రిత్వ శాఖ రూ. 1214.19 కోట్లు చూపింది. ప్రస్తుత 2022-23 బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. అదేవిధంగా, కార్యాలయ వసతి భూమి కొనుగోలు కోసం మంత్రిత్వ శాఖ రూ.669.13 కోట్లు అంచనా వేయగా, గత రెండు బడ్జెట్లలో రూ.448 కోట్లు కేటాయించారు.
అమరావతిలో నివాస గృహాల నిర్మాణానికి మంత్రిత్వ శాఖ ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయింపులు కూడా చూపింది. మొత్తం ప్రాజెక్టును రూ.11,266.55 కోట్లుగా మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. బడ్జెట్ కేటాయింపులో అమరావతిని ఆరుసార్లు ప్రస్తావించగా మూడుసార్లు ఏపీ కొత్త రాజధానిగా అభివర్ణించారు. అమరావతిలో ఏజీ కోసం 300 స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణాన్ని మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఇది కాకుండా విజయవాడలో రూ. 4,000 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయాన్ని నిర్మించాలని మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.