కూటమి ప్రభుత్వం హయాంలో గిరిజనులకు మహర్దశ : కేంద్ర మంత్రి పెమ్మసాని
కూటమి ప్రభుత్వ హయాంలో గిరిజనులకు మహర్దశ అని.. వచ్చే అయిదేళ్లలో రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టిసారించనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
By Kalasani Durgapraveen Published on 15 Nov 2024 12:45 PM GMTకూటమి ప్రభుత్వ హయాంలో గిరిజనులకు మహర్దశ అని.. వచ్చే అయిదేళ్లలో రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టిసారించనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి, జన్ జాతీయ గౌరవ దినోత్సవం, గిరిజన స్వాభిమాన ఉత్సవాలు-2024ను కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కేంద్ర, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖల అధికారులు, గిరిజన సంఘాల నేతలు తదితరులతో కలిసి శుక్రవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రారంభించారు. గిరిజనుల సంప్రదాయ నృత్యం థింసాతో అతిథులకు గిరిజన మహిళలు స్వాగతం పలికిన అనంతరం.. గిరిజన ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో భగవాన్ బిర్సా ముండాతో పాటు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వంటి గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
బీహార్‌లోని జమూయ్‌లో ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ కార్యక్రమంలో దేశ ప్రధాని ఇచ్చిన సందేశాన్ని వర్చువల్‌గా తిలకించిన అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఒక వీరునిగానే కాకుండా న్యాయం, సమానత్వం కోసం పోరాడిన బిర్సా ముండా వంటివారి జీవితం ఆదర్శప్రాయమని.. వారి ఆశయాలను భావితరాలకు అందించేందుకు ఇలాంటి వేడుకలు అవకాశం కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. అవమానాలను అణగదొక్కుకొని, ఆత్మాభిమానాన్ని అలంకరించుకొని బిర్సా ముండా స్వేచ్ఛకోసం పోరాడి.. ప్రాణాలర్పించారని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో గిరిజన వీరుల కృషిని స్మరించుకునేందుకు, మన సాంస్కృతిక వారసత్వాన్ని, జాతీయ గౌరవ పరిరక్షణకు ప్రధాని 2021లో బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15ను జనజాతీయ గౌరవ దివస్-గిరిజన స్వాభిమాన ఉత్సవాలను ప్రకటించడం జరిగిందన్నారు. ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద నేడు ప్రధానమంత్రి దాదాపు రూ. 6 వేల కోట్లతో పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి సంబంధించి 50 మల్టీ పర్పస్ కేంద్రాలను రూ. 30 కోట్లతో చేపట్టడం జరుగుతుందన్నారు. 100మందికి పైబడిన జనాభా ఉన్న గిరిజన గ్రామాలన్నింటినీ రహదారులతో అనుసంధానం చేయడం జరుగుతుందని.. ప్రతి గిరిజన గ్రామానికి పక్కా ఇళ్లు, తాగునీటి కుళాయిలు, అంగన్వాడీ కేంద్రాలు, సౌర విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.
ప్రధాని, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి సారథ్యంలో గిరిజనుల సమగ్రాభివృద్ధికి కృషిచేయడం జరుగుతుందని.. అరకు కాఫీకి ముఖ్యమంత్రి కృషివల్లే జాతీయస్థాయి గుర్తింపు లభించిందని.. వివిధ గిరిజన ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ వాటికి ప్రత్యేక గుర్తింపు తెస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకునేలా గిరిజనులను ప్రోత్సహించనున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.