జైళ్లలో సంస్కరణలు, బలోపేతంపై కేంద్రం ఫోకస్..రూ.950 కోట్లు కేటాయింపు: బండి సంజయ్
దేశవ్యాప్తంగా జైళ్ల బలోపేతంతోపాటు ఆయ జైళ్లను సంస్కరించి ఖైదీల్లో మార్పు తీసుకురావడంపై కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
By - Knakam Karthik |
జైళ్లలో సంస్కరణలు, బలోపేతంపై కేంద్రం ఫోకస్..రూ.950 కోట్లు కేటాయింపు: బండి సంజయ్
విశాఖపట్నం: దేశవ్యాప్తంగా జైళ్ల బలోపేతంతోపాటు ఆయ జైళ్లను సంస్కరించి ఖైదీల్లో మార్పు తీసుకురావడంపై కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. జైళ్ల ఆధునీకరణ ప్రాజెక్టు కింద రూ.950 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.. హై-సెక్యూరిటీ జైళ్లతోపాటు ఆయా జైళ్లలో భద్రతా మౌలిక సదుపాయాల బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలోని సాయిప్రియా రిసార్ట్ట్స్ రెండ్రోజులపాటు నిర్వహించిన ‘‘జైలు అధికారుల 9వ జాతీయ సమ్మేళం’ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ..ఈ సదస్సు ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన Correctional Administrators పరస్పర అనుభవాలను పంచుకునే అవకాశం లభించడమే కాకుండా, ఉత్తమ ఆచరణల (Best Practices), వినూత్న కార్యక్రమాల, విధానపరమైన అవసరాలుపై లోతైన చర్చ జరగడం ద్వారా జైలు పరిపాలన నాణ్యతను మెరుగుపర్చేందుకు అవసరమైన కార్యాచరణకు మార్గం సుగమం చేస్తోందని అన్నారు.
కస్టడీలో ఉంటూ దుర్బల జీవితాన్ని అనుభవిస్తున్న పేద ఖైదీల సంరక్షణ, మోడల్ జైలు ప్రమాణాల అమలు, ఖైదీల విడుదల అనంతర పునరావాసం వంటి అంశాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. పేద ఖైదీలకు మద్దతు పథకం, జైళ్ల ఆధునీకరణ ప్రాజెక్టు అమలులో వ్యూహాలు, మోడల్ ప్రిజన్ మాన్యువల్–2016, మోడల్ ప్రిజన్స్ & కరెక్షనల్ సర్వీసెస్ చట్టం–2023 అమలులో సవాళ్లపైనే ఈ సదస్సులో చర్చించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత – సెక్షన్ 479 అమలు, జైళ్లలో సాంకేతికత వినియోగం, ఆధార్ ధృవీకరణ, వీడియో కాన్ఫరెన్సింగ్, టెలీమెడిసిన్, జైలు శిక్షణా సంస్థల ప్రామాణీకరణ & గుర్తింపు వంటి అంశాలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
జైళ్లలో సంస్కరణలకు విధాన మార్గదర్శకాలు, చట్టపరమైన నిర్మాణం, లక్ష్యిత పథకాల ద్వారా కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం నిరంతరం మార్గదర్శనం చేస్తోంది...అని బండి సంజయ్ పేర్కొన్నారు. పేద ఖైదీలకు మద్దతు పథకం కింద ఏటా రూ.20 కోట్లు కేటాయిస్తున్నామని ఇప్పటివరకు 16 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 237 మంది ఖైదీలకు ఈ పథకం ద్వారా ఉపశమనం లభించిందని చెప్పారు. జైళ్ల ఆధునీకరణ ప్రాజెక్టు కింద మొత్తం రూ.950 కోట్లు కేటాయించామని హై-సెక్యూరిటీ జైళ్లు మరియు భద్రతా మౌలిక సదుపాయాల బలోపేతమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.101.45 కోట్లు కేటాయించడం జరిగింది..అని తెలిపారు.