హైదరాబాద్: కాజీపేట రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కొన్ని పనులకు అనుమతులు కావాలని, అందుకే ఆలస్యం అవుతోందని చెప్పారు. సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో 1026 కిలోమీటర్ల మేరకు కవచ్ ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రం నుంచి ఐదు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, అన్ని రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తయిందని కేంద్రమంత్రి చెప్పారు. రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల కేటాయింపును కూడా అశ్వినీ వైష్ణవ్ వివరించారు. తెలంగాణకు రూ.5,337 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రికార్డు స్థాయిలో రూ.9,417 కోట్లు కేటాయించామన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 1326 కిలోమీటర్ల కవచ్ టెక్నాలజీ పని చేస్తోందన్నారు. ఏపీకి యూపీఏ హయాంలో కంటే 11 రెట్లు ఎక్కువ కేటాయించామన్నారు. ఏపీలో 73 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు ఇచ్చి రూపు రేఖలు మారుస్తున్నామని చెప్ఆపరు. రూ.8,455 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేశామని అన్నారు. ఏపీ నుంచి తెలంగాణ, ఒడిశా, తమిళనాడుకు రైల్వే లైన్ల అనుసంధానం చేస్తున్నామని వెల్లడించారు. ఏపీకి మరిన్ని నమోభారత్, వందేభారత్ రైళ్లు కేటాయించామని, రైళ్ల వేగం మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.