'స్కిల్' కేసును సీబీఐకి అప్పగించాలని ఉండవల్లి పిటిషన్
స్కిల్ డెవలప్‌మెంట్ కేసును సిబిఐకు అప్పగించాలంటూ మాజీ ఉంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
By అంజి Published on 22 Sept 2023 9:27 AM IST
'స్కిల్' కేసును సీబీఐకి అప్పగించాలని ఉండవల్లి పిటిషన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై సీఐడీ ఫైల్ చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును సీబీఐకి అప్పగించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆర్థికి విషయానికి సంబంధించిన ఈ కేసు పలు రాష్ట్రాలతో ముడిపడి ఉందని, ఈ కేసులో ప్రముఖులు నిందితులుగా ఉండటం వల్ల దర్యాప్తును సీబీఐతో జరిపించాలని ఉండవల్లి తన వ్యాజ్యంలో కోరారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సీఐడీ, ఏపీ స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్, గంటా సుబ్బారావు, కె.లక్ష్మీనారాయణ, నిమ్మగడ్డ వెంకటకృష్ణ ప్రసాద్, డిజైన్‌టెక్ సంస్థ, ఆ సంస్థ ఎండీ వికాస్ ఖన్వేల్కర్, స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్, సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్, మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా 44మందిని తన పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లో అరెస్టయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఏసీబీ స్పెషల్ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించిందించిన సంగతి తెలిసిందే. నేటితో చంద్రబాబు రిమాండ్ ముగియనుంది. ఈ సమయంలోనే స్కిల్ డెపలప్‌మెంట్ స్కాంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కుంభకోణాన్ని సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని కోర్టును అభ్యర్థించారు. పిల్‌లో రూ.241 కోట్ల దారి మళ్లింపు, పూర్తి నిందితులత జాబితాతో సవివరంగా వివరాలు పొందుపర్చారు ఉండవల్లి. కాగా ఉండవల్లి పిటిషన్ వచ్చే వారం విచారణకు రానున్నట్లు తెలుస్తోంది.