AP: గర్భిణిపై సామూహిక అత్యాచారం.. నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష
2022లో ఆంధ్రప్రదేశ్‌లోని రేపల్లె రైల్వే ప్లాట్‌ఫాం సమీపంలో గర్భిణిపై సామూహిక అత్యాచారం చేసిన ఇద్దరు వ్యక్తులకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది.
By అంజి Published on 10 Aug 2023 8:19 AM ISTAP: గర్భిణిపై సామూహిక అత్యాచారం.. నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష
2022లో ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా రేపల్లె రైల్వే ప్లాట్‌ఫాం సమీపంలో గర్భిణిపై సామూహిక అత్యాచారం చేసిన ఇద్దరు వ్యక్తులకు బుధవారం 20 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. రేపల్లె పట్టణానికి చెందిన పి విజయ కృష్ణ, పి నిఖిల్‌లకు గుంటూరు అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు జైలు శిక్ష విధించింది. ''మేము వారిని (నిందితులు) ఒక సంవత్సరం వ్యవధిలో దోషులుగా నిర్ధారించాము. వారికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఈ కేసును డీజీపీ వ్యక్తిగతంగా పర్యవేక్షించారు'' అని సంచలనాత్మక కేసు దర్యాప్తును పర్యవేక్షించిన బాపట్ల పోలీసు సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ పిటిఐకి చెప్పారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలానికి చెందిన బాధితురాలు తన భర్త, పిల్లలతో కలిసి 2022 ఏప్రిల్ 30వ తేదీ రాత్రి 11.30 గంటలకు కృష్ణా జిల్లా నాగాయలంక గ్రామానికి కూలీ పనులకు వెళ్తుండగా రేపల్లె రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అప్పటికే అర్థరాత్రి కావడంతో అందరూ ప్లాట్‌ఫారమ్‌పైనే పడుకున్నారు. మే 1, 2022న తెల్లవారుజామున 1 గంటల సమయంలో కృష్ణ,నిఖిల్ నిద్రిస్తున్న కుటుంబాన్ని లేపి బాధితురాలి భర్తపై దాడి చేసి, అతని నుండి కొంత నగదును లాక్కున్నారు. వారు మహిళను ప్లాట్‌ఫాం పక్క వైపుకు ఈడ్చుకెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారం చేశారు. ఇంతలో బాధితురాలి భర్త అక్కడి నుంచి తప్పించుకుని రేపల్లె పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు పరుగులు తీశాడు.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకోవడంతో నిందితులు పరారయ్యారు. అయితే, కొన్ని గంటల్లో, పోలీసులు వారిని పట్టుకోగలిగారు. న్యాయ ప్రక్రియ ద్వారా గరిష్ట శిక్షను నిర్ధారించడానికి ఒక సంవత్సరంలో వారిని దోషులుగా నిర్ధారించారని జిందాల్ చెప్పారు. అంతేకాకుండా, మహిళలకు సంబంధించిన, పోక్సో, ఇతర తీవ్రమైన కేసుల్లో నిందితులు చట్టం నుండి తప్పించుకోకుండా చూసేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) కె రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కోర్టు ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్‌ను అమలు చేశారని ఎస్పీ పేర్కొన్నారు. ఇలాంటి నేరాలను శాస్త్రీయ ఆధారాలతో ఈ వ్యవస్థ రుజువు చేస్తుందన్నారు.