దేశ చరిత్రలోనే తొలిసారిగా విశాఖపట్నం జిల్లా అనకాపల్లి సమీపంలోని కోడూరు గ్రామంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో రూ. 200 కోట్ల విలువైన రెండు లక్షల కిలోలకు పైగా ఎండు గంజాయిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు దహనం చేయనున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత రెండేళ్లలో రెండు లక్షల కిలోలకు పైగా గంజాయి పట్టుబడింది. ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమంతో రాష్ట్రం లో గంజాయి నిర్మూలనకు ఏపీ పోలీస్ డిపార్ట్‌మెంట్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ఈ ఆపరేషన్ లో రాష్ట్రంలోని వివిధ శాఖల సమన్వయంతో పాటు సరిహద్దు రాష్ట్రాల సహాయ సహకారాలతో విస్తృతంగా గంజాయి తోటల సాగు పై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. అనేక దశాబ్దాలుగా ఏఓబీతో పాటు గిరిజన గ్రామాలలో గంజాయి సాగు కొనసాగుతోంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఏపీ సీనియర్ పోలీసు అధికారుల సమక్షంలో ఈ భారీ మొత్తంలో గంజాయిని ఏకాంత ప్రదేశంలో కాల్చివేస్తారు. కార్యక్రమం కోసం డ్రోన్ కెమెరాలు, స్పీకర్లు, సౌండ్ సిస్టమ్స్, ఫ్యాన్సీ టెంట్లు అందుబాటులో ఉంచారు.