పరాకామణిలో బంగారం చోరీపై ఆ పత్రిక కథనాన్ని ఖండించిన టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయ పరాకామణిలో భారీ స్థాయిలో బంగారం దొంగతనం జరిగిందంటూ ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీవ్రంగా ఖండించింది
By - Knakam Karthik |
పరాకామణిలో బంగారం చోరీపై ఆ పత్రిక కథనాన్ని ఖండించిన టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయ పరాకామణిలో భారీ స్థాయిలో బంగారం దొంగతనం జరిగిందంటూ ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీవ్రంగా ఖండించింది. వాస్తవాలను వక్రీకరించి రాసిన ఈ కథనం పూర్తిగా అసత్యమని, భక్తుల్లో అనవసర అపోహలు కలిగించేలా ఉందని స్పష్టం చేసింది. ఈ ఘటనపై టీటీడీ వివరణ ఇస్తూ.. 2025 జనవరి 11న పరాకామణిలో విధులు నిర్వహిస్తున్న ఏబీఆర్పొజ్ (ABREPOSE) సంస్థకు చెందిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్య 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను అపహరించేందుకు ప్రయత్నించగా, విజిలెన్స్ మరియు సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారని తెలిపింది. నిందితుడు ఆ బంగారు బిస్కెట్‌ను ఖాళీగా ఉన్న స్టీల్ హుండీ ట్రాలీ పైపు రంధ్రంలో దాచిపెట్టిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా నమోదయ్యాయని, ఆ ఆధారాలను కోర్టుకు కూడా సమర్పించామని వెల్లడించింది.
ఈ ఘటనపై తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని, నిందితుడిని జనవరి 13న అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపగా సుమారు 30 రోజుల పాటు జైలులో ఉన్నాడని టీటీడీ వివరించింది. పోలీసుల దర్యాప్తులో భాగంగా నిందితుడి ఇల్లు మరియు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా.. ఘటన స్థలంలో దొరికిన 100 గ్రాముల బంగారు బిస్కెట్‌తో పాటు, అదనంగా 631.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 157 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. అలాగే ప్రముఖ జ్యువెలరీ దుకాణాల్లో బంగారం మార్పిడి చేసిన రసీదులు, నిందితుడి ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు వివరాలను సేకరించి 12 మంది సాక్షులను విచారించినట్లు తెలిపింది. ఈ కేసు ప్రస్తుతం CC No.309/2025గా న్యాయస్థానంలో విచారణలో ఉందని, తదుపరి విచారణ 2026 ఏప్రిల్ 13న జరగనుందని టీటీడీ వెల్లడించింది.
ఈ దొంగతనం ప్రయత్నాన్ని విజిలెన్స్ సిబ్బంది సమర్థవంతంగా అడ్డుకుని చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ, సదరు పత్రిక కోట్ల విలువైన బంగారం మాయమైందంటూ నిరాధార ప్రచారం చేయడం సరికాదని టీటీడీ మండిపడింది. శ్రీవారి ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీసేలా, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఇలాంటి కథనాలు ప్రచురించడం భావ్యం కాదని హితవు పలికింది. పరాకామణి ప్రక్రియలో బహుళస్థాయి భద్రత, కఠిన నియంత్రణ విధానాలు, నిరంతర సీసీటీవీ పర్యవేక్షణ అమలులో ఉన్నాయని, భక్తులు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.