గోశాలలో ఆవుల మృత్యువాత వ్యాఖ్యలు.. టీటీడీ మాజీ ఛైర్మన్‌పై కేసు
తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతి ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు చేశారు.
By Knakam Karthik
గోశాలలో ఆవుల మృత్యువాత వ్యాఖ్యలు.. టీటీడీ మాజీ ఛైర్మన్‌పై కేసు
తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతి ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఎస్పీ హర్ష వర్ధన్ రాజుకు కంప్లయింట్ చేశారు. ఎస్వీ గోశాలలో 100 ఆవులు మృతి చెందాయని..పవిత్రమైన గోశాలను గోవధ శాలగా మార్చారంటూ భూమన తప్పుడు ఆరోపణలు చేశారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఆయన ఫిర్యాదు మేరకు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమనపై బీఎన్ఎస్ యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
అయితే టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గోశాలలో మూడు నెలల్లోనే వందకు పైగా గోవులు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డాయంటూ భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించడం మరింత కలకలం రేపింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వరుసగా జరుగుతున్న ఈ గోమరణాలను టీటీడీ ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందంటూ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఎస్వీ గోశాలలో వందకు పైగా గోవులు చనిపోయాయంటూ భూమన ఆరోపించడంతో... గోశాలకు వచ్చి చూడాలంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్ విసిరారు.
దీనికి స్పందించిన భూమన తాను గురువారం వస్తానని ప్రకటించగా, దీనిని కూటమి నేతలు స్వాగతించారు. అటు, గోశాలకు వెళ్లేందుకు మందీమార్బలంతో భూమన కరుణాకర్‌రెడ్డి సిద్ధమయ్యారు. ఎంపీ గురుమూర్తితో కలిసి ర్యాలీగా బయల్దేరిన భూమనను పోలీసులు అడ్డుకున్నారు. నేతలు, కార్యకర్తలతో వెళ్లి శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని కోరారు. గన్ మెన్లను తీసుకొని సింగిల్‌గానే వెళ్లాలని కరుణాకర్ రెడ్డికి పోలీసులు సూచించారు. ఆ సమయంలో పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసుల తీరుకు నిరసనగా నడిరోడ్డుపై పడుకుని భూమన కరుణాకర్రెడ్డి నిరసన తెలిపారు. భూమనకు మద్దతుగా మాజీ మంత్రి రోజా, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అక్కడకు చేరుకోవడంతో హైటెన్షన్ హైటెన్ష వాతావరణం నెలకొంది.