రాష్ట్రాభివృద్ధికి గల్లా పెట్టె సహకరించట్లేదు.. చెత్తతో సంపద సృష్టిస్తాం: సీఎం చంద్రబాబు

అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఎన్నో పథకాలను అమలు చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. పింఛన్ల పెంపు, మహిళలకు ఉచిత సిలిండర్లు, అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని గుర్తు చేశారు.

By అంజి  Published on  15 Feb 2025 5:15 PM IST
create wealth from garbage, CM Chandrababu, Kandukur Sabha, APnews

రాష్ట్రాభివృద్ధికి గల్లా పెట్టె సహకరించట్లేదు.. చెత్తతో సంపద సృష్టిస్తాం: సీఎం చంద్రబాబు

అమరావతి: అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఎన్నో పథకాలను అమలు చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. పింఛన్ల పెంపు, మహిళలకు ఉచిత సిలిండర్లు, అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో సంపద పెరగలేదని, రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. ఇంకా ఎంతో చేయాలని ఉందని, కానీ గల్లా పెట్టె సహకరించడం లేదన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకునేందుకు నెలలో ఓరోజు కేటాయించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజలు మంచిగా ఆలోచిస్తే రాష్ట్రానికి తిరుగులేదని కందుకూరుస భలో చెప్పారు.

చెత్త పన్ను వేసిన గత చెత్త ప్రభుత్వం దాన్ని తొలగించలేదని మండిపడ్డారు. ప్రస్తుతం చెత్త నుంచి సంపద సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అక్టోబర్‌ 2 నాటికి 85 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్తను తొలగించే బాధ్యతను మున్సిపల్‌ శాఖకు అప్పగించామన్నారు. అటు రాష్ట్రంలో జరుగుతున్న ఆకృత్యాలపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే గుర్రంకొండలో యువతిని ఒకడు పొడిచేశాడని, పైగా ఇద్దరూ కలిసి విషం తాగినట్టు డ్రామా చేశాడని అన్నారు. మొన్న గుంటూరులో ఒకడు ఇద్దరిపై అత్యాచారం చేసి జైలుకు వెళ్లాడని, ఈ మానవ మృగాలను కఠినంగా శిక్షిస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

Next Story