'ఏపీని ఏఐ హబ్‌గా మార్చండి'.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
విజయవాడ: మారుతున్న కాలానికి అనుగుణంగా ఏపీలో టెక్నాలజీ రంగంలో సంస్కరణలు అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు.
By అంజి Published on 6 Nov 2024 6:43 AM IST'ఏపీని ఏఐ హబ్‌గా మార్చండి'.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
విజయవాడ: మారుతున్న కాలానికి అనుగుణంగా ఏపీలో టెక్నాలజీ రంగంలో సంస్కరణలు అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వివిధ విధానాల్లో మార్పులు తీసుకురావడం ద్వారా ఏపీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్‌గా మార్చే ప్రణాళికలను వివరించారు. ఐటీ, డ్రోన్ తయారీ, సెమీకండక్టర్ పరిశ్రమలకు సంబంధించిన విధానాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ ప్రసాద్, మంత్రి జనార్దన్‌రెడ్డి తదితరులు చర్చించారు.
డ్రోన్ ఉత్పత్తి కంపెనీలకు అనంతపురంను డెస్టినేషన్‌గా మార్చాలని సీఎం చంద్రబాబు.. అధికారులకు సూచించారు. శ్రీసిటీని సెమీకండక్టర్ హబ్‌గా ఎలివేట్ చేయడంపై దృష్టి సారించాలని, ఇది రాష్ట్ర ఆర్థిక వైవిధ్యం, సాంకేతిక పురోగతికి గణనీయంగా దోహదపడుతుందని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఐటీ రాజధానిగా విశాఖపట్నంను అభివృద్ధి చేయాలని, తద్వారా సాంకేతిక పరిజ్ఞాన రంగంలో దాని స్థాయిని పెంచాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు.
సాంకేతిక పురోగతిని ఉపయోగించుకునేందుకు, టెక్ పరిశ్రమలో అగ్రగామిగా ఏపీని ప్రపంచ పటంలో ఉంచడానికి ఈ కార్యక్రమాలు ప్రభుత్వ చురుకైన విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయని అధికారులు తెలిపారు. తరువాత, ముఖ్యమంత్రి సోషల్ మీడియా పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు. ''ఈ రోజు, నేను మూడు కీలక విధానాలకు ఆదేశాలు ఇచ్చాను, వీటిని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకురానుంది. అవి ఏపీ సెమీకండక్టర్ ఫ్యాబ్ 4.0, ఏపీ డేటా సెంటర్ పాలసీ 4.0, ఏపీ డ్రోన్ విధానం'' అని చంద్రబాబు పేర్కొన్నారు.