అమరావతి: మెగా డీఎస్సీలో కొత్తగా ఎంపికైన టీచర్లకు అక్టోబర్ 3వ తేదీ నుంచి శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. డీఎస్సీ-2025లో ఎంపిక అయిన ఉపాధ్యాయులకు అక్టోబర్ 3వ తేదీ నుంచి 10 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరికి పోస్టింగులు ఇచ్చేందుకు 9, 10వ తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అకడమిక్ కేలండర్, హ్యాండ్‌బుక్ తదితర మెటీరియల్‌ను శిక్షణలో అందించనున్నారు.
మరో వైపు రెండో విడత ట్రెయినింగ్‌లో భాగంగా ఏప్రిల్ 25 నుంచి మే 5వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. పంచాయతీ కార్యదర్శులు, కానిస్టేబుళ్లుగా పని చేస్తూ డీఎస్సీకి ఎంపికైన వారి కోసం శిక్షణకు హాజరుకావడానికి ఆయా విభాగాలు సెలవులు మంజూరు చేయడంలేదని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోస్టింగ్ ఇచ్చినప్పటి నుంచే విధుల నుంచి రిలీవ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖ మాత్రం డీఎస్సీలో అర్హత సాధించిన టీచర్లు తప్పనిసరిగా శిక్షణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.