రథ సప్తమి రోజున తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీకాకుళంలోని అరసవిల్లిలోని సూర్య భగవానుడిని దర్శించుకునేందుకు ఉదయాన్నే భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. దేవాలయాలను కాపాడుకుని మన సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
మరోవైపు తిరుమలలో రథ సప్తమి వేడుకలను టీటీడీ ప్రారంభించింది. సూర్య ప్రభ వాహనంపై తిరుమాడవీధుల్లో మలయప్ప స్వామి ఊరేగింపు జరిగింది. ఇవాళ శ్రీవారి దర్శనానికి భక్తులను సర్వదర్శనంలో మాత్రమే అనుమతి ఇస్తామని టీటీడీ తెలిపింది.
ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహన సేవ, ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహన సేవ, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వ భూపాల వాహన సేవ, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవతో వేడుకలు ముగుస్తాయి. అటు నేడు రథసప్తమి సందర్భంగా యాదాద్రిలోనూ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వచ్చారు.