అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. విద్యార్థుల రక్షణ, భద్రత దృష్ట్యా ముందస్తుగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు యాజమాన్య పాఠశాలలకు సెలవు ప్రకటించిన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు సంబంధిత జిల్లా అధికారుల ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు.
ఇదిలావుంటే.. అల్పపీడనం ప్రభావంతో రాబోయే రెండు రోజులు కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, అలాగే రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇప్పటికే ప్రభావం చూపే జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ప్రఖర్ జైన్ వెల్లడించారు. భారీవర్షాలు, బలమైన గాలులు నేపధ్యంలో ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలన్నారు.