తిరుపతి తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 40 మంది గాయపడ్డారు. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను మంత్రులను వంగలపూడి అనిత, ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, పార్థసారథి పరామర్శించారు. రుయా ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించి ఘటనపై ఆరా తీశారు.
ప్రభుత్వం తరఫున బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాగా మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. తిరుపతి ఘటనపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణాలు చోటు చేసుకోవడం బాధకరమని ముర్ము ట్వీట్ చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.