Tirupati: స్విమ్స్‌లో జూనియర్ వైద్యురాలిపై రోగి దాడి.. జట్టు పట్టుకుని వెనుక నుండి.. వీడియో

శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS)లో ఎమర్జెన్సీ వార్డులో విధులు నిర్వహిస్తున్న జూనియర్ రెసిడెంట్ డాక్టర్‌పై దాడి జరిగింది.

By అంజి  Published on  25 Aug 2024 3:08 PM IST
Tirupati, Patient attacks junior doctor, SVIMS, APnews

Tirupati: స్విమ్స్‌లో జూనియర్ వైద్యురాలిపై రోగి దాడి.. జట్టు పట్టుకుని.. వెనుక నుండి.. 

తిరుపతి: దేశవ్యాప్తంగా రెసిడెంట్ వైద్యుల ఆగ్రహానికి కారణమైన కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా పిజి డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం, హత్య కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో.. తిరుపతిలోని సిమ్స్‌ ఆస్పత్రిలో అలాంటి ఆందోళనకర సంఘటన ఒకటి జరిగింది.

శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS)లో ఎమర్జెన్సీ వార్డులో విధులు నిర్వహిస్తున్న జూనియర్ రెసిడెంట్ డాక్టర్‌పై దాడి జరిగింది. వైద్య సంఘంలో విస్తృతంగా షేర్‌ చేయబడుతున్న CCTV ఫుటేజీ వీడియోలో ఒక రోగి వైద్య విద్యార్థి జుట్టును హింసాత్మకంగా లాగడం, ఆమె తలను టేబుల్‌కు కొట్టడం చూపిస్తుంది.

డాక్టర్ తల స్టీలు కడ్డీకి తగిలింది

ప్రస్తుతం సర్జరీ విభాగంలో ఇంటర్‌ చేస్తున్న వైద్య విద్యార్థిని తన ఫిర్యాదు లేఖలో జరిగిన సంఘటనను వివరించింది. ఆగస్టు 24న ఆమె ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో విధులు నిర్వహిస్తుండగా బంగారు రాజు అనే పేషెంట్ అనూహ్యంగా ఆమెపై వెనుక నుంచి దాడి చేసి, ఆమె జుట్టును పట్టుకుని, తలను మంచంలోని స్టీల్ రాడ్‌కు బలంగా కొట్టాడు. ఆమె తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, ఆమెకు గాయాలయ్యాయి. ఆ సమయంలో అక్కడ భద్రత లేదు. వెంటనే చుట్టుపక్కల ఉన్న ఆమె తోటి వైద్యులు ఆమెను రక్షించారు.

విజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి పాదయాత్రగా కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన రోగి మూర్ఛ వ్యాధిగ్రస్తుడని సమాచారం. తొలుత తిరుమలలోని టీటీడీ అశ్విని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను శనివారం ఉదయం స్విమ్స్‌కు తరలించి అక్కడ డ్రిప్‌లు, ఇతర చికిత్సలు అందించారు.

అయితే దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ఆస్పత్రి వద్ద వైద్యులు నిరసన చేపట్టారు

దాడికి ప్రతిస్పందనగా, శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీకి చెందిన జూనియర్ డాక్టర్లు, విద్యార్థులు క్యాజువాలిటీ వార్డు వెలుపల బైఠాయించి నిరసన తెలిపారు.

దాడికి గురైన విద్యార్థి ఆస్పత్రిలో భద్రత గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. రోగి ఆయుధాలను కలిగి ఉంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉండేదని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ వంటి హైరిస్క్ ప్రాంతాల్లో మెరుగైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆమె అధికారులను కోరారు.

స్టైపెండ్‌లను సక్రమంగా చెల్లించడం, మెరుగైన హాస్టల్ సౌకర్యాలు, ఆసుపత్రి ప్రాంగణంలో భద్రతను మెరుగుపరచడం వంటి పని పరిస్థితులను మెరుగుపరచాలని దేశవ్యాప్తంగా జూనియర్ వైద్యులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.

ఈ డిమాండ్లకు ఆజ్యం పోసిన కోల్‌కతాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలోని సెమినార్ హాల్‌లో ఒక జూనియర్ డాక్టర్ మృతదేహం ఆగస్టు 9న తీవ్ర గాయాలతో కనిపించింది.

Next Story