తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం తీపి కబురు చెప్పింది. ఇవాళ్టి నుంచి రాత్రి భోజనంలో భక్తులకు మసాలా వడలు వడ్డిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే తిరుమల శ్రీవారి భక్తులకు మసాలా వడలు అన్నప్రసాదంలో భాగంగా అందిస్తున్నారు. రోజుకు 30 వేల నుంచి 35 వేల వడలు వడ్డిస్తున్నట్లు వెల్లడించింది.
ఇకపై రోజుకు 70-75 వేల వడలు వడ్డించనున్నట్లు పేర్కొంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉల్లి, వెల్లుల్లి లేకుండా మసాలా వడలు తయారుచేసి భక్తులకు వడ్డిస్తున్నారు. కాగా టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానం మేరకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం మెనూలో మసాలా వడను చేర్చారు. మార్చి 6, 2025 నుంచి భక్తులకు దీనిని వడ్డించడం ప్రారంభించారు.