పాపికొండలు అభయారణ్యంలో వదిలిపెట్టిన 'ఎక్స్‌ప్లోరర్' అనే పెద్దపులి ఇప్పుడు రంపచోడవరం ఏజెన్సీ గ్రామాల వైపు వెళ్ళింది. అడవి నుంచి పులి గ్రామాల వైపు వస్తుండటంతో తమ ప్రాణాలకు రక్షణ లేదంటూ గిరిజనులు చెబుతున్నారు. విల్లులు-బాణాలతో పులిపై ఎదురుదాడికి దిగుతామని ఆదివాసీలు హెచ్చరించారు. ఫిబ్రవరి 6న రాజమండ్రి పరిసరాల్లో పట్టుబడ్డ ఈ పెద్దపులికి 'ఎక్స్‌ప్లోరర్' అని నామకరణం చేసి, వారం క్రితం పాపికొండల అభయారణ్యంలో అటవీ శాఖ అధికారులు విడిచిపెట్టారు. గత ఐదు రోజులుగా ఇది బోలగొండ ఫారెస్ట్ పరిధిలోని రంప, మర్రవాడ, పెద్ద గొండ గ్రామాలకు సమీపంలోనే సంచరిస్తోంది.
ఒక ఆవుదూడపై దాడి చేయడంతో గిరిజనుల సహనం నశించింది. ప్రస్తుతం అడవిలో జీడి పిక్కలు సేకరించే కీలక సమయం కావడంతో పులి భయం కారణంగా గిరిజనులు అటవీ ప్రాంతంలోకి వెళ్లలేకపోతున్నారు. "అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి మా గ్రామాలపైకి పులిని వదిలారు. మా ప్రాణాలు కాపాడుకోవడానికి మా దగ్గర ఉన్న బాణాలతో పులిపై దాడి చేస్తాం" అంటూ ఆదివాసి భారత్ పార్టీ ఇంచార్జ్ అంజిరెడ్డి ఒక వీడియో సందేశం ద్వారా హెచ్చరించారు. పులి తన దారిన తాను వెళ్ళిపోతుందని, మరో రెండు రోజుల పాటు గిరిజనులు అడవిలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.