జిల్లాల పున:వ్యవస్థీకరణపై ఎలాంటి ప్రతిపాదన లేదు

ప్రస్తుతానికి జిల్లాల పున:వ్యవస్థీకరణకు సంబంధించి రాష్ర్ట ప్రభుత్వం వద్ద గానీ, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పరిశీలనలో గానీ ఎటువంటి ప్రతిపాదనలు లేవని రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

By Medi Samrat  Published on  7 March 2025 3:37 PM IST
జిల్లాల పున:వ్యవస్థీకరణపై ఎలాంటి ప్రతిపాదన లేదు

ప్రస్తుతానికి జిల్లాల పున:వ్యవస్థీకరణకు సంబంధించి రాష్ర్ట ప్రభుత్వం వద్ద గానీ, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పరిశీలనలో గానీ ఎటువంటి ప్రతిపాదనలు లేవని రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. కొత్తగా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి రెండు ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు. బాపట్ల జిల్లాలోని బాపట్ల, చీరాల, రేపల్లే మూడు రెవెన్యూ డివిజన్లను సవరించి అద్దంకి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆ జిల్లా కలెక్టర్ నుండి ప్రతిపాదన వచ్చిందన్నారు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా లోని మడకశిరను రెవెన్యూ డివిజన్ గా మార్చాలంటూ ఆ జిల్లా కలెక్టర్ నుండి కూడా నివేదిక వచ్చిందని చెప్పారు. ఈ రెండు డివిజన్ల ఏర్పాటును రాష్ర్ట ప్రభుత్వం పరిశిలీస్తుందని తెలిపారు. కాగా ఎమ్మిగనూరు, ఉదయగిరి కేంద్రాలను కూడా రెవెన్యూ డివిజన్లుగా మార్చాలని స్థానిక శాసనసభ్యుల నుండి ప్రతిపాదనలు వచ్చాయన్నారు. శుక్రవారం నాడు శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో జిల్లాల పున:వ్యవస్థీకరణపై సభ్యులడిగిన ప్రశ్నలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో జిల్లాల విభజనను అస్తవ్యస్తంగా చేశారన్నారు. ప్రజ‌ల ఆకాంక్షల‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు జ‌రిగిన కార‌ణంగానే.. చాలా చోట్ల నిర‌స‌న‌లు జరిగాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలతో పాటు ఉద్యోగుల ఆందోళన, పీఆర్సీ అంశాలను పక్కదారి పట్టించేందుకే జగన్ రెడ్డి జిల్లాల విభజనను తెరపైకి తీసుకువచ్చారన్నారు. క‌నీసం కేబినెట్ లో కూడా స‌మ‌గ్రంగా చ‌ర్చించ‌కుండా....రాత్రికి రాత్రి నోటిఫికేష‌న్ విడుద‌ల చెయ్యాల్సిన అవ‌స‌రం ఏముందని ప్రశ్నించారు. అశాస్త్రీయంగా చేసిన కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రాంతాల మ‌ధ్య విభేదాలు త‌లెత్తే ప‌రిస్థితి తెచ్చారన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు పలు చోట్ల గందరగోళంగా తయారయ్యాయని, భౌగోళికంగానూ ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. సంబంధంలేని ప్రాంతానికి మన్నెం జిల్లా పేరుపెట్టడం, విజయవాడలో కలిసి ఉన్న ప్రాంతాలను మచిలీపట్నంలో కలపడం, రాజంపేట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని జిల్లాకు అన్నమయ్య పేరు పెట్టినా.. జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రతిపాదించడం వంటి అనేక గందరగోళాలు చోటు చేసుకున్నాయన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం నియోజకవర్గాలను, డివిజన్లు, మండలాలను ఇష్టానుసారంగా మార్చేశారన్నారు. 2022లోనే కొత్త జిల్లాలపై నిర్ణయం తీసుకున్నప్పటికీ జగన్ రెడ్డి గద్దె దిగేంత వరకు కూడా కొత్త జిల్లా కేంద్రాలను కుర్చీ,బల్లలు లేకుండానే నడిపారన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాల్లో మౌళిక సదుపాయలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాల ఏర్పాటు సమయంలో పారదర్శకంగా, సమగ్రంగా వ్యవహరించకపోవడం వల్ల రాష్ర్ట వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చెలరేగాయన్నారు. ముఖ్యంగా కొనసీమ జిల్లా పేరు మార్పుపై ఆ జిల్లా అంతటా పెచ్చరిల్లిన ఉద్యమం హింసాత్మకంగా మారిందన్నారు. నాలుగు రోజుల నుండి ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపినా పరిస్థితిని అంచనా వేసి హింస చెలరేగకుండా ఆపడంలో అప్పటి జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.

Next Story