ఆంధ్రప్రదేశ్ లో కేవలం నాలుగు షోలకు మాత్రమే పర్మిషన్ ఉంది. అయితే ఈరోజు నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమా విడుదల ఉండడంతో పలు ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు వేశారు. ఈ విషయం అధికారులకు తెలియడంతో చర్యలకు ఉపక్రమించారు.
కృష్ణాజిల్లా మైలవరంలో అఖండ సినిమాను అనుమతి లేకుండా బెనిఫిట్ షో వేయడంపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సినిమా వేసిన సంఘమిత్ర ధియేటర్ ను సీజ్ చేశారు అధికారులు. ఈ థియేటర్ లో మ్యాట్నీ షోను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు మైలవరం డిప్యూటీ తాసిల్దార్ శ్రీహరి. ఏపీలో టికెట్ల పెంపకంతో పాటు అదనపు షో వేసుకునేందుకు అనుమతి లేకుండా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రోజుకు కేవలం నాలుగు షోలు మాత్రమే వేయాలని, సాధారణ టికెట్ రేట్లు మాత్రమే కొనసాగించాలని ఆదేశించింది. వీటికి విరుద్ధంగా వ్యవహరించి సంఘమిత్ర థియేటర్ యాజమాన్యం షో వేసింది.
వరంగల్ నగరంలో అఖండ సినిమాను ప్రదర్శిస్తున్న ఓ థియేటర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ప్రేక్షకులు భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ ఘటన వరంగల్ నగరంలోని జెమిని థియేటర్‌లో చోటు చేసుకుంది. జెమిని థియేటర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రేక్షకులు సినిమా చూస్తుండగానే థియేటర్‌లో పొగలు అలుముకున్నాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు థియేటర్ బయటకు పరుగులు తీశారు. థియేటర్ యాజమాన్యం వెంటనే అప్రమత్తమై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.