Andrapradesh: రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేలో రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By -  Knakam Karthik
Published on : 7 Oct 2025 1:20 PM IST

Andrapradesh, Ap Government, Ration Cards

Andrapradesh: రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి: ఆంధ్రప్రదేలో రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచడమే కాకుండా, అర్హులకే సబ్సిడీ లబ్ధి అందేలా చూడాలన్న ఉద్దేశ్యంతో అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. వరుసగా మూడు నెలలపాటు రేషన్ సరుకులు తీసుకోకపోయినా, లేదా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయకపోయినా, సంబంధిత రేషన్ కార్డులు రద్దు కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా న్యాయమైన పంపిణీ విధానం కొనసాగేందుకు ఈ-కేవైసీని తప్పనిసరి చేశారు. రేషన్ కార్డుదారులు తమ ఆధార్ వివరాలు, బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా ఈ ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. దీనివల్ల డూప్లికేట్ కార్డులు, నకిలీ లబ్ధిదారులు గుర్తిస్తారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.

ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో తీసుకున్న చర్యలు రాష్ట్రవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ మొత్త 6,61,141 రేషన్ కార్డులు నమోదు కాగా, అందులో 5.72 లక్షల కుటుంబాలు మాత్రమే ప్రతి నెలా బియ్యం తీసుకుంటున్నాయి. అంటే సుమారు 14 శాతం మంది లబ్దిదారులు మూడు నెలలుగా సరుకులు తీసుకోకపోవడంతో, వారిని అనర్హులుగా పరిగణించి వారి కార్డులను నిలిపివేశారు. మరోవైపు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో చివరి విడత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ప్రకాశం జిల్లాలో 1.50 లక్షల దరఖాస్తులు కొత్త కార్డులకోసం, కుటుంబ సభ్యుల మార్పులకోసం అందగా, వాటిలో 17 వేల దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. అందులో 14,296 మందిని అర్హులుగా గుర్తించి, వారికి స్మార్ట్ కార్డులు మంజూరు చేశారు.

ప్రస్తుతం సిద్ధమైన కార్డులను మండలాల వారీగా తహసీల్దార్ కార్యాలయాలకు తరలించి, త్వరలోనే వాటి పంపిణీ ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం స్పష్టంగా తెలిపినదేమిటంటే.. అర్హులు తప్పకుండా రేషన్ సరుకులు తీసుకోవాలి, లేకపోతే కార్డు రద్దు అవుతుంది. ఈ చర్యలతో, ప్రభుత్వం అనర్హుల చేత సబ్సిడీ వనరులు దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేస్తూ, నిజమైన లబ్ధిదారులకు మేలు జరుగేలా ప్రయత్నిస్తోంది.

Next Story