అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న 13 బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీంలో చట్టసరణ, నాలా చట్టం రద్దు ప్రతిపాదించే చట్టానికి ఆమోదం తెలిపింది. వైఎస్ ఆర్ తాడిగడప మున్సిపాల్టీ పేరులో వైఎస్ ఆర్ పేరు తొలగిస్తూ చట్ట సవరణ చేపట్టనుంది. స్థానిక సంస్థల్లో ఓటర్ల జాబితా సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
అటు జీఎస్టీలో సంస్కరణలు అమలు -2025 బిల్లు, ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టసవరణ, ఏపీ విశ్వవిద్యాలయాల చట్టం లో పలు సవరణలు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులుకు జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేనికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.