AP: క్రైమ్‌రేట్ 10శాతం తగ్గించడమే ప్రధానంగా పోలీసుశాఖ 'పది లక్ష్యాలు'

ఆంధ్రప్రదేశ్‌లో నేరాలను పది శాతమే తగ్గించటమే ప్రధానంగా పోలీసు శాఖ పది లక్ష్యాలను నిర్దేశించుకుంది.

By -  Knakam Karthik
Published on : 19 Dec 2025 9:52 AM IST

Andrapradesh, police department, Ap Police, Cm Chandrababu, Crime Rate

AP: క్రైమ్‌రేట్ 10శాతం తగ్గించడమే ప్రధానంగా పోలీసుశాఖ 'పది లక్ష్యాలు'

ఆంధ్రప్రదేశ్‌లో నేరాలను పది శాతమే తగ్గించటమే ప్రధానంగా పోలీసు శాఖ పది లక్ష్యాలను నిర్దేశించుకుంది. అమరావతిలో రెండ్రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో శాంతి భద్రతలపై జిల్లా ఎస్పీలు, కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శాంతి భద్రతలపై డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో గతంతో పోలిస్తే 5.5 శాతం మేర నేరాల రేటు తగ్గిందని వెల్లడించిన ఆయన మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయన్నారు. 16 జిల్లాల్లో నేరాలు బాగా తగ్గాయి. మిగతా జిల్లాల్లో వేర్వేరు కారణాల వల్ల క్రైమ్ ట్రెండ్ పెరుగుతోందని వివరించారు. అన్నమయ్య లాంటి జిల్లాలో మైగ్రేషన్ లేబర్ కారణంగా నేరాలు జరుగుతున్నాయని వివరించారు. కిడ్నాపింగ్ లాంటి కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. 56 శాతం మేర డిటెక్షన్ రేట్, 55 శాతం మేర రికవరీ రేటు ఉందని తెలిపారు. ఎన్టీఆర్, పశ్చిమగోదావరి జిల్లాల సహా ఐదు జిల్లాల్లో సీసీటీవీల అనుసంధానంతో నేరాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు.

డీహెచ్ఎంఎస్ అనే ఆధునిక సాంకేతికత ద్వారా సీసీ కెమెరాల హెల్త్ ను నమోదు చేస్తున్నామని విజయవాడ సీపీ రాజశేఖర బాబు తెలిపారు. నగరంలో నిఘా కోసం 10 వేల సీసీ కెమెరాల డ్యాష్ బోర్డును కమ్యూనిటీ సహకారంతో రూపొందించామని విజయవాడ సీపీ చెప్పారు. ఫేస్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం..అని సీపీ రాజశేఖర్ బాబు చెప్పారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలే ప్రభుత్వానికి ముఖ్యం

కొన్ని జిల్లాల్లో క్రైమ్ రేటు ఎక్కువగా ఉంది మరికొన్ని చోట్ల తక్కువగా ఉంది..అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలే ప్రభుత్వానికి ముఖ్యం. కడప, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో ప్రాపర్టీ సంబంధిత కేసులు ఎక్కువగా ఉండటానికి కారణం ఏంటో విశ్లేషించండి. పోలీసింగ్ అంటే భయం ఉండాలి. రాష్ట్రంలో 5.5 శాతం మేర నేరాల రేటు తగ్గింది. కానీ జిల్లాల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. అన్నమయ్య, కోనసీమ, నెల్లూరు, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో ఎందుకు పెరిగాయో విశ్లేషించండి..అని సీఎం సూచించారు.

Next Story