ఏపీకి రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్
నేటి (సోమవారం) నుంచి గురువారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి Published on 23 Dec 2024 1:22 AM GMTఏపీకి రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్
అమరావతి: నేటి (సోమవారం) నుంచి గురువారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వెస్ట్ బే ఆఫ్ బెంగాల్‌లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ రేపటికి ఉత్తర తమిళనాడు, ఏపీలోని దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్తుందని వాతావరణ నిపుణలు తెలిపారు. దీని ప్రభావంతో బుధవారం వరకు సముద్రంలో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఈ క్రమంలోనే ముందు అలర్ట్‌గా రాష్ట్రంలోని పోర్టులకు 3వ నంబర్ హెచ్చరిక జారీ చేసినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ అయ్యింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం బలహీనపడింది. ఇది డిసెంబర్ 24 నాటికి పశ్చిమ-నైరుతి దిశగా కదిలి ఉత్తర తమిళనాడు & దక్షిణకోస్తా తీరాలకు సమీపంలో నైరుతి బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉంది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. డిసెంబర్ 24, మంగళవారం ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.