వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. జనవరి 8న తిరుపతిలో ఆరుగురు మరణించిన ఘటనపై విచారణకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి నేతృత్వంలో జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఘటనపై ఆరు నెలల్లో రిపోర్టు సమర్పించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. విచారణ జరిపేందుకు అన్ని రకాల అధికారాలను కమిషన్‌కు ఇస్తున్నట్లు సీఎస్ విజయానంద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జనవరి 8వ తేదీన తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టికెట్ల పంపిణీ సెంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు. పలువురు భక్తులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటన జరిగిన తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం న్యాయ విచారణకు ఆదేశిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు తాజాగా జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.