Telangana: నేడూ అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్

తెలంగాణలో వచ్చే మూడ్రోజులు అతి భారీ నుంచి అత్యంత భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

By అంజి  Published on  28 July 2023 2:55 AM GMT
IMD, heavy rains,Telangana, Rain update

Telangana: నేడూ అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్

బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గురువారం నాటికి బలహీనపడిందని, ప్రస్తుతం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ పరిసరాల్లో కొనసాగుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ కే నాగరత్న తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని చెప్పారు. దీని ప్రభావంతో తెలంగాణలో వచ్చే మూడ్రోజులు అతి భారీ నుంచి అత్యంత భారీ వానలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

వాతావరణశాఖ ఆయ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలుండటంతో, ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. శుక్రవారం నుంచి శనివారం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, భువనగిరి, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

హైదరాబాద్‌ నగరం వర్షానికి తడిసి ముద్దవుతోంది. నిన్న సాయంత్రం నగరంలో తెరిపి ఇచ్చిన వర్షం.. ఇవాళ తెల్లవారుజాము నుంచి నుంచి మళ్లీ మొదలైంది. ఠి, నాంపల్లి, లక్డీకపూల్‌, మాసబ్‌ట్యాంక్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్టా, అమీర్‌పేట్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, మాదాపూర్‌, కొండాపూర్‌, ఏఎస్‌ రావు నగర్‌, కూకట్‌పల్లి, నీజాంపేట్‌, మూసాపేట్‌, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్‌, ప్రగతి నగర్‌, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. నగరం మొత్తం కారు మేఘాలను కమ్ముకుని. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. గురువారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 97.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.

Next Story