ఏపీ కొత్త డీజీపీ ఎవరంటే?
ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ సమాచారం అందించింది
By Medi Samrat Published on 6 May 2024 10:22 AM GMTఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ సమాచారం అందించింది. కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేసిన నేపథ్యంలో, ముగ్గురు సీనియర్ ఐజీల జాబితా పంపాలని ఈసీ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో, ఏపీ ప్రభుత్వం సీనియారిటీ ప్రకారం ద్వారకా తిరుమలరావు, హరీశ్ కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ ల పేర్లను సిఫారసు చేసింది. ఎన్నికల సంఘం ఈ జాబితా నుంచి హరీశ్ కుమార్ గుప్తాను ఏపీ డీజీపీగా ఎంపిక చేసింది. హరీశ్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు. తక్షణమే డీజీపీగా విధుల్లో చేరాలని హరీశ్ కుమార్ గుప్తాను ఈసీ ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024కి కేవలం ఒక వారం ముందు జరిగింది. రాజేంద్రనాథ్ రాష్ట్రంలో ఎన్నికలను నిర్వహించడానికి చురుకుగా పని చేస్తున్నారు. ఇంతలోనే డీజీపీ పదవి నుండి రివీల్ కావాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. మే 5న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చిన నోటీసు ప్రకారం.. రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేస్తూ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. కింది ర్యాంక్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆంధ్ర ప్రదేశ్ లో 2024లో శాసనసభకు, ప్రజల సభకు ఏకకాల ఎన్నికలు పూర్తయ్యే వరకు అధికారిని ఎన్నికల సంబంధిత పనులకు కేటాయించరాదని కూడా కమిషన్ ఆదేశించింది.