అమరావతి: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మిస్తోన్న గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణ గడువు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పోర్టు నిర్మాణం పూర్తి చేసే గడువును మరో 434 రోజులు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ 21 లోగా పూర్తి చేయాల్సి ఉండగా గడువును 2026 డిసెంబర్ 28 వరకు పెంచింది. పలు సహేతుక కారణాలతో ప్రాజెక్టు పనులు ఆలస్యమైనట్లు ప్రాజెక్టు నిర్మిస్తోన్న మేఘా ఇంజినీరింగ్ సంస్థ తెలిపింది.
గడువు పెంచేందుకు తెలిపిన కారణాలను పరిశీలించి నిర్మాణ సంస్థ ప్రతిపాదనలను టెక్నికల్ కమిటీ ఆమోదించింది. 2026 డిసెంబర్ 28 లోపు పోర్టు నిర్మాణాలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గడువు విధించింది. తగు చర్యలు తీసుకోవాలని ఏపీ మారిటైమ్ బోర్డు సీఈఓకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.