అన్ని రంగాల్లో ఏపీ నెం.1 ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం: లోకేశ్
అన్ని రంగాల్లో ఏపీ నెం.గా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, దేశంలోనే మంగళగిరిని అభివృద్ధి పథాన నిలుపుతామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
By - Knakam Karthik |
అన్ని రంగాల్లో ఏపీ నెం.1 ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం: లోకేశ్
మంగళగిరి: అన్ని రంగాల్లో ఏపీ నెం.గా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, దేశంలోనే మంగళగిరిని అభివృద్ధి పథాన నిలుపుతామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి బైపాస్ ఆత్మకూరులో లక్ష్మీ గ్రూప్ ఆధ్వర్యంలో శ్రీ ధనలక్ష్మి ఆటో ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ నూతనంగా ఏర్పాటుచేసిన టాటా హిటాచీ డీలర్ షిప్ షోరూం, మెషిన్ కేర్ ఫెసిలిటీని రిబ్బన్ కట్ చేసి మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఇక్కడకు వస్తుంటే రోడ్డుపైన ఒక ఎక్స్ కవేటర్ పెట్టారు. అది చూసినప్పుడు నాకు 2019-24 మధ్య రోజులు గుర్తుకువచ్చాయి. గత ప్రభుత్వంలో శుక్ర, శనివారాలు వస్తే ఈ బుల్డోజర్ ను ఎవరో ఒకరి ఇంటికి పంపేవారు. ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది. ప్రజా ప్రభుత్వంలో మాత్రం ఎక్స కవేటర్స్ ను అభివృద్ధి కోసం, అమరావతి పనులు, రోడ్లు అభివృద్ధి చేసేందుకు ఉపయోగిస్తోంది. మంగళగిరి అమరావతికి ముఖద్వారం. అమరావతిలో పనులు చేసే వారు మంగళగిరిలోనే ఉండాలి. సోషల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎకో సిస్టమ్ మంగళగిరిలోనే ఇప్పుడు సిద్ధంగా ఉంది. 2019 ఎన్నికల్లో 21 రోజుల ముందు మంగళగిరికి వచ్చా. మీ సమస్యలను నేను అర్థం చేసుకోలేకపోయా, నేనేంటో మీకు తెలియదు. 5300 ఓట్ల తేడాతో ఓడిపోయాను. ఐదేళ్లపాటు మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు తెలుసుకున్నా. ప్రభుత్వం కంటే మెరుగైన సేవా కార్యక్రమాలను ఆనాడు నేను చేశాను...అని లోకేశ్ పేర్కొన్నారు.
గూగుల్‌తో పాటు డీలర్ షిప్‌లు కూడా ముఖ్యమే
డీలర్ షిప్ వల్ల ఎంతోమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ప్రతి ఉద్యోగం ఎంతో ముఖ్యం. గూగుల్ లాంటి సంస్థ వస్తే సరిపోదు. వారు భవన నిర్మాణాలు చేయాలంటే ఎకో సిస్టమ్ కావాలి. ఇదే ఎక్స్ కవేటర్, బుల్డోజర్ కూడా అవసరం. దానికి సర్వీస్ సెంటర్ కావాలి. చంద్రబాబుని చూసే నేను ఇది నేర్చుకున్నా. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం. డీలర్ షిప్ ల వల్ల కూడా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. మొత్తం ఎకో సిస్టమ్ వస్తే మేం ఇవన్నీ సాధించగలగుతాం..అని లోకేశ్ అన్నారు.
దేశంలోనే మంగళగిరిని నెం.1గా అభివృద్ధి చేస్తాం
మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉంటా. దేశంలోనే మంగళగిరి నియోజకవర్గాన్ని నెం.1 అభివృద్ధి చేస్తాం. వచ్చే నెలలో భూగర్భ డ్రైనేజీ పనులు కూడా ప్రారంభిస్తాం. టాటా హిటాచీ ఎండీ సందీప్ సింగ్ మద్దతు ఏపీకి ఉండాలని కోరుకుంటున్నాను. కంపెనీలు ఏపీకి రావడం వెనుక అనేక మంది కృషి ఉంది. అన్ని రంగాల్లో ఏపీ నెం.1 ఉండాలనేదే మా లక్ష్యం అని అన్నారు.