పేదలకు గుడ్‌న్యూస్..ఇళ్లు, 2 లేదా 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం

రాష్ట్రంలోని పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది

By -  Knakam Karthik
Published on : 24 Oct 2025 4:34 PM IST

Andrapradesh, Amaravati,  coalition government, House For All

పేదలకు గుడ్‌న్యూస్..ఇళ్లు, 2 లేదా 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం

అమరావతి: రాష్ట్రంలోని పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పేదలందరికీ ఇళ్లు, ఇళ్లస్థలాలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలు, హౌసింగ్‌పై నియమించిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ మీటింగ్‌లో చర్చించారు. అందరికి ఇళ్లు, రెవెన్యూశాఖలో తీసుకురానున్న భూ సంస్కరణలపై చర్చించిన మంత్రుల కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి ప్రకటించారు.

ఈ సందర్భంగా మంత్రి పార్థసారధి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఏర్పాటు చేసి వినియోగం లేని లే అవుట్ లను రద్దు చేయాలని నిర్ణయించాం. లే అవుట్లలో గతంలో ఇచ్చిన 1 లేదా 1.5 సెంట్ల స్థలాలను రద్దు చేసి 2, 3సెంట్లుగా మార్చి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. నిర్మాణాలు చేయని వారు ఒప్పుకుంటే 2 లేదా 3 సెంట్లు స్థలాలుగా మార్చే యోచన చేస్తున్నాం. లబ్దిదారులు తమ స్థలాలు మార్చి ఇచ్చేందుకు ఒప్పుకుంటే అలా ఇచ్చే ప్రతిపాదనపై చర్చించాం. అధికారులతో చర్చించి తదుపరి తుది నిర్ణయం తీసుకుంటాం..అని మంత్రి పార్థసారధి పేర్కొన్నారు.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలకు ఇచ్చేందుకు అవకాశాలను చర్చించాం. సుప్రీంకోర్టు ఆదేశాల దృష్ట్యా ఇబ్బంది లేకుండా ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ఆలోచన చేస్తున్నాం. ఏజీతో సంప్రదించి అభిప్రాయం తీసుకుని తదుపరి మీటింగ్ లో ఈ అంశంపై చర్చిస్తాం. బాలయ్య విషయంలో వైఎస్ జగన్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ దిగజారి ప్రవర్తిస్తున్నారు. 2020లో అదానితో అగ్రిమెంట్ చేసుకుంటే అతను ఎందుకు పారిపోయారు. గూగుల్ డేటా సెంటర్ పై తప్పుడు మాటలు మాట్లాడుతూ వైఎస్ జగన్ దిగజారి ప్రవర్తిస్తున్నారు. దోపిడీ , బెదిరింపుల కారణంగానే గతంలో అదాని రాష్ట్రం ను వీడి వెళ్లారు..అని మంత్రి విమర్శించారు.

Next Story