ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్మికులందరికీ త్వరలోనే ఆరోగ్య బీమా అమలు చేయబోతున్నట్లు రాష్ట్ర చేనేత, జౌలిశాఖ మంత్రి సవిత తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు వారంలో ఏదైనా ఒక రోజు కచ్చింతగా చేనేత దుస్తులు ధరించాలని ఆదేశాలు జారీ చేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు.
త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులకు మర మగ్గాలకు ఉచిత విద్యుత్ కూడా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. రాబోయే దసరా నాటికి చేనేత సహకార సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చేనేత రంగం అభివృద్ధి చెందలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేనేత రంగం గాడిలో పడిందని తెలిపారు. అర్హులైన వారికి వర్క్ షెడ్లను కూడా త్వరలో మంజూరు చేస్తామని తెలిపారు. చేనేత ఉత్పత్తులను ఇక నుంచి 20 శాతం పెంచిన ధరలతో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆప్కో చేనేత సంఘాల నుంచి వస్త్రాలు కొనుగోలు చేస్తుందని మంత్రి సవిత పేర్కొన్నారు.