న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో ఆరు అణు రియాక్టర్ల ఏర్పాటు కోసం వెస్టింగ్‌హౌస్ కంపెనీ (అమెరికా)తో చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర భూ శాస్త్రాల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. పార్లమెంటు సమావేశాల మూడో రోజు గురువారం రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. వెస్టింగ్‌హౌస్ కంపెనీతో చర్చల అనంతరం కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అయ్యే ఖర్చు, నిర్మాణానికి పట్టే సమయం వంటి వివరాలతో ప్రాజెక్టు ప్రతిపాదనలను ఖరారు చేస్తామని మంత్రి వివరించారు.
ప్రస్తుతం ప్రాజెక్ట్ ప్రీ నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భూసేకరణ, ప్రాజెక్ట్ కోసం అవసరమైన అనుమతులు పొందడం, ప్రాజెక్ట్ సైట్ యొక్క స్థలాకృతి అధ్యయనం జరుగుతున్నాయి. కొవ్వాడ అణువిద్యుత్ ప్రాజెక్టు కోసం 2,079 ఎకరాల భూమి అవసరమన్నారు. ఇప్పటి వరకు 2061 ఎకరాల భూసేకరణ పూర్తయిందని, ఈ భూమిని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ పేరుతో బదలాయించడం కూడా పూర్తయినట్లు మంత్రి తన సమాధానంలో ప్రస్తావించారు.
కొవ్వాడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో దాదాపు 8,000 మందికి ఉపాధి లభిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత ఒక్కో యూనిట్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్లాంట్లలో ఉపాధి అవకాశాలతో పాటు విద్యుత్ ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత కాంట్రాక్టర్లు, విక్రేతల ఆర్థిక కార్యకలాపాల వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి జితేంద్ర సింగ్ వివరించారు.