శుభవార్త..కాంట్రాక్టర్లకు నరేగా పెండింగ్ బిల్లులు విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో చిన్న చిన్న వర్క్ లు చేసిన కాంట్రాక్టర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik
శుభవార్త..కాంట్రాక్టర్లకు నరేగా పెండింగ్ బిల్లులు విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో చిన్న చిన్న వర్క్ లు చేసిన కాంట్రాక్టర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2014-19 సమయంలో జాతీయ ఉపాధి హామీ పనుల కింద రాష్ట్రంలో జరిగిన పలు కాంట్రాక్ట్ వర్కులు నిమిత్తం రూ. 180 కోట్లను కేంద్ర ప్రభుత్వం నేడు విడుదల చేసింది. జరిగిన పనులను జరగలేదంటూ వైసీపీ గడిచిన ఐదేళ్లలో ఆ బిల్లులను తొక్కి పెట్టినప్పటికీ కాంట్రాక్టర్లకు కూటమి ప్రభుత్వం న్యాయం చేసింది. కక్ష సాధింపులు ఎల్లకాలం చెల్లవని మరోసారి రుజువైంది." అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు.
"2019లో నరేగా (జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) కింద చిన్న స్థాయి కాంట్రాక్టర్లు చేపట్టిన రూ.250-300 కోట్ల పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లుల విషయంలో ఎట్టకేలకు న్యాయం జరిగింది. ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్ మార్పులతో పాటు, కాంట్రాక్టర్ల బిల్లులు మొత్తం ఆపివేయడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా వీరికి ఒక్క పైసా బిల్లులు కూడా చెల్లించలేదు.కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తరువాత, కేంద్ర, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య సమన్వయం జరిగి, పాత సాఫ్ట్‌వేర్‌ను తిరిగి అమలులోకి తీసుకురావడంతో పాటు, 4.3 లక్షల వర్కుల్లో 3.5 లక్షల వర్కులను తిరిగి ఓపెన్ చేయగలిగాం. మిగిలిన వర్కుల్లోని సాంకేతిక సమస్యలను పరిశీలించి పరిష్కరించడంపై చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ప్రక్రియ ద్వారా దాదాపు రూ.180 కోట్ల పెండింగ్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన Matching Funds కేటాయించి, వచ్చే 30 రోజుల్లోగా అన్ని బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించేలా Rural Development శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు మంత్రివర్గ స్థాయిలో జరిగిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నాం. ఈ కీలక నిర్ణయం ద్వారా దాదాపు 3.5 లక్షల మంది చిన్న కాంట్రాక్టర్లకు – వారి వర్క్ పరిమాణాన్ని బట్టి రూ.5 లక్షలు, రూ.10 లక్షలు, రూ.15 లక్షల వరకు పెండింగ్ బిల్లులు విడుదల కానున్నాయి. గత ప్రభుత్వం చేపట్టిన కక్ష సాధింపు ధోరణికి ఇది సరైన ధర్మమైన సమాధానం. ప్రజలపట్ల న్యాయంగా వ్యవహరించే ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది అనే నిజాన్ని మరోసారి ప్రజలకు చాటిచెప్పిన రోజుగా ఇది నిలిచిపోతుంది." అని పెమ్మసాని పేర్కొన్నారు.