అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం దసరా కానుక ఇచ్చింది. డీఏ విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల సమావేశంలో సీఎం జగన్ ప్రకటన మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 3.64 శాతం డీఏ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2022 జూలై ఒకటో తేదీ నుంచి డీఏ అమల్లోకి వస్తుంది. ఉద్యోగులకు వారి బేసిక్ పేలో 22.75 శాతం నుంచి 26.39 శాతానికి పెంచిన కరువు భత్యాన్ని 2022 జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
డీఏ పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్న సీఎస్ జవహర్ రెడ్డిని ఉద్యోగుల సంఘం నేతలు కలిసి డీఏ విడుదల చేయాలని కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. అగస్ట్ 2న విజయవాడలో జరిగిన ఏపీఎన్జీవో రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో సీఎం జగన్ డీఏ ఇస్తామని ప్రకటించారు. దసరాకు రెండు రోజుల ముందు డీఏ విడుదలకు ఉత్తర్వులు వెలువరించారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ శాఖల్లో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.