ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయి. అభ్యర్థులు 30 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. టెట్ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 2,67,559 మంది టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.
120 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేసినట్టు విద్యాశాఖ ప్రకటించింది. తెలంగాణాలో మూడు, కర్ణాటకలో నాలుగు, తమిళనాడులో రెండు, ఒడిశా రాష్ట్రంలో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల పర్యవేక్షణకు 26 మంది సీనియర్ అధికారుల్ని నియమించారు. పరీక్షా కేంద్రాల తనిఖీలకి 29 ఫ్లైయింగ్ స్క్వాడ్ లు ఏర్పాటు చేశారు. మార్చి 10వ తేదీన ప్రాథమిక కీ, 14వ తేదీన తుది ఫలితాలు వెల్లడి అవుతాయి.