ఏపీలో పెరగనున్న ఉష్ణోగ్రతలు.. తెలంగాణలో 10 రోజుల పాటు వేడిగాలులు
ఆంధ్రప్రదేశ్‌లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల తర్వాత రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.
By అంజి
ఏపీలో పెరగనున్న ఉష్ణోగ్రతలు.. తెలంగాణలో 10 రోజుల పాటు వేడిగాలులు
ఆంధ్రప్రదేశ్‌లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల తర్వాత రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా, అన్నమయ్య జిల్లా సంబేపల్లి, నల్లమడ, సత్యసాయి జిల్లా మడకశిరలో మంగళవారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెబుతున్నారు. బుధవారం రాష్ట్రంలోని 28 మండలాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ఆయా మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు
మంగళవారం నాడు తెలంగాణ అంతటా చెదురుమదురు వర్షాలు కురిసిన తరువాత రాష్ట్రంలో తేమ స్థాయి పెరిగింది. బుధవారం నుండి రాష్ట్రంలో వేడిగాలులు వస్తాయని అంచనా. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) వాతావరణ సూచన ప్రకారం.. గరిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుండి 44 డిగ్రీల పరిధిలో, కనిష్ట ఉష్ణోగ్రతలు 26 డిగ్రీల నుండి 29 డిగ్రీల రేంజ్‌లో నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో రానున్న 3 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. బుధవారం వరకు ఏకాంత ప్రదేశాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం/ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత పొడి వాతావరణం ఉంటుందని అంచనా.